Tomato Prices In Telangana Today : రాష్ట్రంలో టమాటా ధరలు విపరితంగా పెరిగాయి. కూరలోకి టమాటా కొనాలంటే సామాన్య ప్రజలు ఒక్కటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టమాట దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటుగా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ నుంచి టమాటాల సరఫరా తగ్గుముఖం పట్టడంతో మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి.
సామాన్యులకు ‘టమాటా’ చుక్కలు చూపిస్తోంది. కిలో ధర రూ.100 చేరువవ్వడంతో టమాటాకు టాటా చెప్పాల్సిన సమయం వచ్చిందంటున్నారు. రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కిలో రూ.51 ఉంటే రూ.70కి తగ్గకుండా అమ్ముతున్నారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పుచ్చులు, మచ్చలున్న, మెత్తటి టమాటాలు తీసుకోవాలంటున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇక బహిరంగ మార్కెట్‌లో రూ.90 నుంచి రూ.100 వరకు విక్రయాలు సాగిస్తున్నారు.
దిగుబడి తగ్గడంతో ప్రతిరోజూ నగరంలో రైతుబజార్లకు 6వేల క్వింటాళ్ల టమాటాలు వచ్చేవి. తొలకరి పంట చేతికందక ప్రస్తుతం 2.5 నుంచి 3వేల క్వింటాళ్లే వస్తోంది. దీంతో డిమాండ్ పెరిగి ధర కొండెక్కింది. సెప్టెంబరు వరకు దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ధరలు ఇలాగే ఉండే అవకాశముంది. శివార్లలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం రైతుల నుంచి కూడా టమాట పెద్దగా రావడం లేదు. ఏపీలోని మదనపల్లి, రాజస్థాన్ నుంచి వచ్చే టమాటా 60శాతం తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.