Tomato Prices are Falling Day by Day in Telangana :టమాటా ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. పది రోజుల క్రితం కిలో రూ.50 పలికిన టమాటా ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో టమాటా కేవలం రూ.10లకే విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో మరీ ఈ స్థాయిలో టమాటా రేట్లు ఎప్పుడూ పడిపోలేదు. ఆరుగాలం శ్రమించి, వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట చివరకు మార్కెట్‌కు తీసుకొచ్చేసరికి ధరలు పడిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కొద్దిరోజుల క్రితంకిలో టమాటా రూ.80 నుంచి రూ.100లతో బెంబేలెత్తించాయి. గత పదిరోజుల వరకూ రూ.50 పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. నాణ్యమైన టమాటా సైతం 25 కిలోల ట్రేను కేవలం రూ.200లకే విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో కిలో టమాటాను రూ.10లకు అమ్ముతున్నారు. అలాగే ఒకేసారి 3 కిలోలు కొంటే రూ.20లకే అమ్ముతున్నారు. కనీసం కేజీ రూ.20 ఉంటే తప్ప తమకు పెట్టిన పెట్టుబడి కూడా రాదని అన్నదాతలు వాపోతున్నారు.
కిలో టమాట రూపాయి కంటే తక్కువా? - రహదారిపై రైతుల ఆందోళన
పంట పండించినగ్రామాల నుంచి సరుకు రైతు బజార్‌కు రావాలంటే ఆటో ఖర్చు ఒక్కో ట్రేకు రూ.50, అలాగే హమాలీ కూలీ రూ.10 కలిపితే మొత్తం 60 రుపాయలు అవుతోంది. చివరికి సరుకు విక్రయించగా వచ్చిన డబ్బులు కూలీ, హమాలీ, రవాణా ఖర్చులకే సరిపోతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు స్థానికంగా పండించిన టమాటా పంట ఎక్కువ మొత్తంలో మార్కెట్‌కు వస్తుండటంతో ధరలు ఒక్కసారిగా పడిపోతున్నాయి.