Manchu Manoj Tweet on Tirupati Laddu Issue : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు, ధార్మిక సంఘాలు, పీఠాదిపతులు, సినిమా వాళ్లు, సామాన్యులు ఇలా అందరూ కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వును కలుపుతున్నారని వస్తున్న వార్తలు తనను ఎంతగానో బాధించాయని నటుడు మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై రాజకీయ పార్టీలు అన్నీ ఒకే తాటిపైకి రావాలని మంచు మనోజ్ కోరారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన బాధ్యులను గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. మన సంస్కృతి, మతపరమైన వాటిని గౌరవించాలని కోరారు.
"లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ మన పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడారని తెలిసి తీవ్ర కలత చెందాను. ఇది కేవలం లోపం కాదు. ఇది విశ్వాసాన్ని ఉల్లంఘించడం. రాజకీయాలకు అతీతంగా హిందూ మనోభవాలకు అవమానం. ఈ తరుణంలో అన్ని పార్టీలు ఏకతాటి పైకి రావాలి. బాధ్యులను గుర్తించి, జవాబుదారీతనం ఉండేలా చూడాలి. మన సంస్కృతిక, మతపరమైన విలువలను గౌరవించాలి. పవిత్ర సంప్రదాయాల ఉల్లంఘనలను సహించబోమని చేపట్టే చర్యలతో ఒక ఉదాహరణగా నిలవాలి. అన్ని విశ్వాసాలను గౌరవించే దేశంగా మనకు ప్రియమైన వాటిని రక్షించుకోవడానికి ఐక్యంగా ఉందాం."- మంచు మనోజ్, సినీ నటుడు