Highest Temperature in Telangana :రాష్ట్రంలో రోజురోజుకూ భానుడు భగ్గుమంటున్నాడు. ఇప్పటికే పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటేయగా, తాజాగా పది జిల్లాల్లోని 20 మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పెరిగిన ఎండల కారణంగా హైదరాబాద్ నగరంలో పగటి వేళలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
పగటి పూట ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వడ దెబ్బ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అత్యవసరం అయితే తప్ప బయట తిరగొద్దని, శరీరంపై ఎండ పడకుండా పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలు ధరించాలని టోపీలు, గొడుగులు వాడాలని వాతావరణ శాఖ సూచించింది. ఇంటి పట్టున ఉండేవారు కూడా నీరు ఎక్కువగా తాగాలని, నీటి శాతం అధికంగా ఉండే దోస, పుచ్చకాయ, కర్బూజ, ద్రాక్ష, నిమ్మ జాతి పండ్లు తినడం, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మ రసంలో కాస్త ఉప్పు కలుపుకుని తాగాలని, ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఆరు బయట పనులు చేయాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
weather forecast in Hyderabad :గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎండల తీవ్రత నమోదవుతోంది. గత సంవత్సరం మే నెలతో పోల్చితే, ఈసారి ఏకంగా 7.5 డిగ్రీలకు పైగా పెరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 5వ తేదీ వరకు వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎండ దెబ్బకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.