ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి తొక్కిసలాట ఘటన - ఇంతకీ అసలు ఏం జరిగిందంటే? - TIRUPATI STAMPEDE INCIDENT

తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద రాత్రి తోపులాటలో ఆరుగురు మృతి - రుయా, స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న మరో 48 మంది క్షతగాత్రులు

Tirupati_Stampede_Incident
TIRUPATI STAMPEDE INCIDENT (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2025, 6:31 AM IST

TIRUPATI STAMPEDE INCIDENT: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా భక్తులు తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను రుయా, స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఏం జరిగింది: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. తొలుత గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లను జారీ చేస్తామని వెల్లడించారు. దీంతో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం బుధవారం ఉదయం నుంచే భక్తులు టోకెన్ల జారీ కేంద్రాలకు చేరుకున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సత్యనారాయణపురం జెడ్పీ హైస్కూల్‍, విష్ణునివాసం, శ్రీనివాసం, ఇందిరా మైదానం, రామచంద్రపుష్కరణి, ఎమ్మార్‍ పల్లి ప్రాంతాలకు భారీగా భక్తులు తరలివచ్చారు.

తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్‌ హైస్కూల్​ వద్ద స్వల్ప తోపులాట జరిగింది. ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద భారీగా తరలివచ్చిన భక్తులను సమీపంలో ఉన్న పద్మావతి పార్క్​లోకి తరలించారు. రాత్రి 8 గంటల 15 నిమిషాల సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురవడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు.

రుయా, స్విమ్స్‌ ఆసుపత్రులలో క్షతగాత్రులు:క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరిచారని భావించిన కొంతమంది భక్తులు ఒక్కసారిగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తోసుకుంటూ ముందుకు రావడంతో చాలామంది కిందపడిపోయారు. ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే క్షత్రగాత్రులను రుయా, స్విమ్స్‌ ఆసుపత్రులకు తరలించారు.

అస్వస్థతకు గురైన వ్యక్తి కోసం గేటు తెరిచేలోపే ఈ విషాదం జరిగిందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు, విశాఖపట్నానికి చెందిన రజిని, లావణ్య , శాంతి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మలగా గుర్తించారు. నర్సీపట్నం పెదబొడ్డేపల్లికి చెందిన నాయుడు బాబు ఈ ఘటనలో మృతిచెందినట్లు ఆయన భార్య మణికుమారి ఫోన్ ద్వారా బంధువులకు తెలియజేశారు. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు.

భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ముందుగా ప్రకటించిన సమయం కంటే ఎనిమిది గంటల ముందే టోకెన్లు జారీ ప్రారంభించారు. రద్దీ ఎక్కువైనుందునే టోకెన్లు జారీకి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. క్షేతగాత్రుల్లో 32 మంది రూయా ఆస్పత్రిలో, 14 మంది స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న భక్తులను టీటీడీ ఛైర్మన్‍, బోర్డు సభ్యులు పరామర్శించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అప్రమతమైన ఉన్నతాధికారులు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేశారు. అదనపు బలగాలను మోహరించి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.

"భక్తులను లైన్లలో పెట్టడం జరిగింది. అయితే ఆ సమయంలో ఒక భక్తుడికి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పడంతో గేట్లు ఓపెన్ చేశాము. వెంటనే మిగిలిన భక్తులు కూడా గేటు మీద పడటంతో తొక్కిసలాట జరిగింది. వెంటనే అందరినీ అదుపు చేసి, టికెట్లు సైతం జారీ చేయడం జరిగింది". - సుబ్బారాయుడు, తిరుపతి ఎస్పీ

తిరుపతిలో తొక్కిసలాట - ఆరుగురు మృతి - పలువురు అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details