Tirumala Brahmotsavam Begins with Dwajarohanam :తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా ఇవాళ సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో వాహన సేవలు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలలో ఇవాళ మొదటి రోజున మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ గరుడ పటాన్ని అర్చకులు ఎగరేశారు. అంతకు ముందు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాత్రి 9 గంటలకు వాహన సేవలు ప్రారంభమయ్యాయి. ఇవాళ తొలిరోజు స్వామివారు పెద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీవారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ మేరకు ఆయన సాయంత్రమే తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. ఏపీ సీఎం పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
నేటి నుంచి వాహనసేవాలు మొదలై తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి అభయ ప్రధానం చేయనున్నారు. 12వ తేదీన చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. నేటి నుంచి ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవలను భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అని ఏర్పాట్లను పూర్తి చేసింది.