Tirumala Srivari Mettu Footpath Closed : వాతావరణశాఖ హెచ్చరికలతో తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. భక్తులకు ఇబ్బందిలేకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారిమెట్టు కాలినడక మార్గాన్ని మూసివేశారు. కొండచరియలపై నిఘా ఉంచి ఘాట్‌రోడ్లలో ట్రాఫిక్‌జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తుల దర్శనాలు, వసతికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. తీరం దాటాక వర్షాలు లేకపోవడంతో టీటీడీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
తీరం దాటిన వాయుగుండం :బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తిరుపతి జిల్లా తడ వద్ద తీరం దాటింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఉమ్మడి కడప జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో వానల ప్రభావంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఆర్కే బీచ్లో అలల తాకిడి - ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం - ఓఎన్‌జీసీ ప్లాంటును తాకిన సముద్ర జలాలు
ఆ జిల్లాల్లో భారీ వర్షాలు :చెన్నై - నెల్లూరు మధ్య తడ సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. గడచిన 6 గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుగా వాయుగుండం కదిలినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరాన్ని దాటిన అనంతరం ఇది క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారినట్టు ఐఎండీ వెల్లడించింది. రాగల 12 గంటల్లో ఇది మరింత బలహీనపడుతుందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది.