Tirumala Srivari Brahmotsavam Simha Vahanam :తిరుమలలో కలియుగ వైకుంఠనాథుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు చిన్న శేషవాహనం, హంస వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ దర్శనమిచ్చిన మలయప్ప స్వామి ఇవాళ ఉదయం సింహ వాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. బ్రహ్మోత్సవాల వేళ మూలమూర్తులు, ఉత్సవ మూర్తులను దర్శించుకొనేందుకు తరలి వచ్చిన భక్తుల గోవింద నామస్మరణలతో తిరుగిరులు మారుమోగుతున్నాయి.
సింహ వాహనంపై అభయప్రదానం :తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఏడుకొండలవాడు వివిధ వాహనాల పై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ కనువిందు చేస్తున్నారు. ఈ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మూడు మూర్తులతో కలిసిన ఆనాబోహో బ్రహ్మనో రూపం.. ఆగళా ద్వైష్ణవం వపుహు.. అంటే బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైన నరసింహ స్వామి రూపంలో ఉన్న మలయప్ప స్వామి పరాక్రమానికి ప్రతీకగా భావించే సింహవాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు - వైభవంగా అంకురార్పణ - Tirumala Srivari Brahmotsavam
హిరణ్యకస్యపుడిని సంహరించిన నృసింహస్వామి రూపంలో ఉన్న స్వామిని దర్శించుకొంటే పాపాలు పటాపంచలై సత్వగుణాన్ని, సౌమ్యత్వాన్ని ప్రసాదిస్తారని భక్తులు విశ్వసిస్తారు. సింహవాహనంపై దర్శనమిచ్చే స్వామి వారి రెండు నేత్రాలలో ఒకటి సూర్య నేత్రం, రెండవది చంద్ర నేత్రంగా పరిగణిస్తారు. సూర్యనేత్రం ద్వారా మనిషిలోని దుష్టభావం తొలగించి, చంద్ర నేత్రం ద్వారా ఆహ్లదాన్ని కలిగిస్తారని ఆగమశాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. సింహవాహనంపై నున్న స్వామిని దర్శిస్తే దుష్టభావాలు తొలగి మంచి కలుగుతుందనే విశ్వాసంతో దర్శనానికి భక్తులు అధికంగా తరలివస్తారు.
సింహ వాహనంపై తిరుమల శ్రీవారు ఎందుకు విహరిస్తారో తెలుసా? - Tirumala Srivari Brahmotsavam
మార్మోగుతున్న తిరుగిరులు :బ్రహ్మోత్సవాలలో ఆదివారం రాత్రి ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు ఉభయ దేవేరులతో విహరిస్తారు. తెల్లటి ముత్యాలతో రూపొందించిన నాలుగు స్తంభాలు, శిఖరంతో కూడుకున్న బంగారు పందిరికి ముత్యాల సరాలు, తోరణాలు, కుచ్చులతో వాహనాన్ని సర్వాంగసుందరంగా అలంకరిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి శ్రీకృష్ణ అవతారంలో రుక్మిణీ, సత్యభామలతో కలిసి ముత్యపుపందిరి వాహనం పై భక్తులకు దర్శనమిస్తారు. భాగవతంలోని కొన్ని ఘట్టాలను అవిష్కరిస్తూ స్వామి వారికి చేసిన అలంకారాలు భక్తులకు కనువిందుచేయనున్నాయి. వాహనాలపై విహరిస్తూ అభయ ప్రదానం చేస్తున్న స్వామివారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో మాడవీధులు కిక్కిరిసిపోతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలు భక్తులను అలరిస్తున్నాయి.
అహంకారాన్ని అణచివేసే విష్ణురూపం- హంస వాహనంపై మలయప్పస్వామి ఊరేగేది అందుకే! - 2024 Srivari Brahmotsavam