Tirumala Srivari Brahmotsavam Celebrations on 7th Day : శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో మలయప్పస్వామి పలు రకాల వాహనాలపై వివిధ రకాల వేషధారణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు గురువారం మలయప్పస్వామి ఉదయం స్వామివారు మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత.
చంద్రప్రభ వాహనంపై వేంకటేశ్వరుడు :సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య, విద్య, ఐశ్వర్యం, సంతానం సిద్ధిస్తుందని భక్తకోటి నమ్మకం. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం మలయప్పస్వామి వారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తకులకు అభయమివ్వనున్నారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది.
స్వర్ణరథం, గజ వాహనాలపై విహరించిన శ్రీనివాసుడు - గోవింద నామస్మరణతో మారుమోగిన తిరుగిరులు
హనుమంత వాహనంపై శ్రీవారు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న(బుధవారం) ఉదయం వరద హస్తం దాల్చిన వేంకటాద్రి హనుమంత వాహనంపై శ్రీవారు ఊరేగారు. రామావతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్వేద నిష్ణాతుడిగా, నవ వ్యాకరణ పండితుడిగా, లంకా భీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు తిరుమలేశుని తన మూపున వహించి తిరువీధులలో దర్శనమిచ్చే ఘట్టం భక్తజన రంజకంగా సాగింది. హనుమంతుని స్మరిస్తే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కాబట్టి ఈ ఇరువురిని చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుందని నమ్మకం.
స్వర్ణ, గజవాహనాలపై మలయప్పస్వామి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం 6వ రోజు సాయంత్రం మలయప్పస్వామి స్వర్ణరథం, గజ వాహనాలపై పయనించి భక్తులను కటాక్షించారు. ముందుగా స్వర్ణరథంపై ఆ తిరుమల వేంకటేశ్వరుడు పయనించాడు. మాడవీధులలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని స్వయంగా లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ కలుగుతాయని భక్తుల నమ్మకం. అలాగే భూదేవి కరుణతో సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని విశ్వాసం. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారిని సాక్ష్యాత్తు గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులకు దర్శనం ఇచ్చాడు.
గజ వాహనంపై శ్రీవారి విహారం- ఒక్కసారి దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా!
తిరుమల శ్రీవారి గరుడసేవ ఎఫెక్ట్ - 'కొండపైకి వాటికి అనుమతి లేదు' - Tirumala Garuda Vahana Seva