Tirumala Salakatla Brahmotsavam : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం స్వామివారిని చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. మురళీకృష్ణుడి అవతారంలో ఆయన భక్తులకు అభయప్రదానం చేశారు. 10 గంటల వరకు చిన్నశేష వాహనసేవ కొనసాగనుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది.
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు శుక్రవారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీనలగ్న శుభముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వ హించారు. తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణ శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుడి రూపంలో తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. తొమ్మిది రోజుల ఉత్సవాల్లో స్వామికి తొలి వాహనసేవ పెద్ద శేషుడిదే. ఆదిశేషుడు శ్రీహరికి పాల కడలిలో తల్పమొక్కటే కాదు అత్యంత సన్నిహితుడు కూడా.
రామావతారంలో లక్ష్మణుడు, ద్వాపరయుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి అండగా నిలిచాడు శేషుడు. వైకుంఠంలో నిత్యసూరులలోనూ ఆద్యుడు. భూభారాన్ని మోసేది శేషుడే. అందుకే బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి తొలివాహన భాగ్యం పెద్దశేషుడికి దక్కింది. నేడు చిన్నశేష వాహనంపై గోవుల కాపరిగా వేణుమాధవుడిగా శ్రీవారు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం హంస వాహనంపై తిరువీధుల్లో శ్రీమన్నారాయణుడు విహరిస్తారు.
అహంకారాన్ని అణచివేసే విష్ణురూపం- హంస వాహనంపై మలయప్పస్వామి ఊరేగేది అందుకే! - 2024 Srivari Brahmotsavam
Dussehra Festival in Srisailam Temple :శ్రీశైల మహాక్షేత్రంలో మూడో రోజు దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు చంద్రఘంట అలంకారంలో భ్రమరాంబ దేవి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గం.కు చంద్రఘంట అలంకారంలో భ్రమరాంబ దేవి దర్శనం సహా స్వామి, అమ్మవార్లకు రావణ వాహనసేవ ఉండనుంది
రెండో రోజు శుక్రవారం భ్రమరాంబాదేవి భక్తు లకు బ్రహ్మచారిణి అలంకరణలో దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లు మయూర వాహనంపై కొలువుతీరారు. ఉభయ దేవాలయాల అర్చకులు ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కళాకారుల సందడి మధ్య శ్రీశైల పుర వీధుల్లో స్వామి అమ్మవార్లును ఊరేగించారు. స్వామి అమ్మవార్ల దివ్య మంగళస్వరూపాన్ని భక్తులు దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతి చెందారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శోభ - Dasara Celebrationson Indrakeeladri
Navratri Celebration On Indrakeeladri :ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతారు. ఈ రూపంలో ఆది పరాశక్తిని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, వాక్‌సిద్ధి, శుద్ధి కలుగుతాయి. మానవుడ్ని సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది. అమ్మ ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం. పరిపూర్ణమైన చిత్తంతో ఆరాధించిన వారి సమస్తపోషణా భారాన్ని ఈమె స్వయంగా వహిస్తుంది.
తొలిరోజు బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు - ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు - Dussehra Celebrations 2024