Tirumala Garuda Vahana Seva 2024 : తిరుమలేశుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు రాత్రి స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను తన్మయపరిచారు. గర్భాలయంలో మూలవర్లకు సదాసమర్పణలో ఉండే చతుర్భుజ లక్ష్మీహారం, ఐదుపేట్ల సహస్రనామం, మకరకంఠి అభరణాలు ధరించిన శ్రీనివాసుడు తిరుమాఢ వీధుల్లో విహరించారు. వాహనం ముందు గజరాజులు నడవగా, జీయ్యంగార్లు స్వామినికీర్తిస్తుండగా, భక్త బృందాలు భజనలు, కోలాటాలతో నేత్రపర్వంగా సాగింది.
ఉదయాన్నే నిండిన గ్యాలరీలు : వేంకటేశుడి వైభవాన్ని చూసేందుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కొండ కిటకిటలాడింది. 221 గ్యాలరీలు కిక్కిరిశాయి. గ్యాలరీలు గోవింద నామ స్మరణతో మార్మోగాయి. స్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఆ దేవదేవుడికి కర్పూరహారతులు పట్టారు. మంగళవారం రాత్రి ఆరున్నరకు ప్రారంభమైన గరుడసేవ అర్థరాత్రి దాకా సాగింది. మంగళవారం ఉదయం నుంచే గ్యాలరీల్లోకి భక్తుల్ని అనుమతించగా మధ్యాహ్నానికే దాదాపు 2 లక్షల మంది భక్తులు నిండిపోయారు. వారందరూ తనివితీరా స్వామివారిని దర్శించుకున్నారు.
వాహనం తూర్పు మాఢవీధి దాటాక, అప్పటి వరకూ గ్యాలరీల్లో ఉన్న భక్తుల్ని బయటకుపంపి మళ్లీ కొత్త భక్తులతో నింపడంతో ఎక్కువ మందికి దగ్గర నుంచి స్వామివారి దర్శన భాగ్యం దక్కింది. టీటీడీ అమలు చేసిన కొత్త విధానం సత్ఫలితాన్నిచ్చింది. భక్తుల ఆకలి తీర్చేలా రాత్రి 1 గంట వరకూ అన్నప్రసాద కేంద్రాన్ని తెరిచి ఉంచారు. వారికోసం 4 లక్షల వాటర్ బాటిళ్లు, 3 లక్షల చొప్పున మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. భక్తుల రవాణా సౌకర్యార్థం తిరుమల ఘాట్ రోడ్లో 24 గంటల పాటు బస్సులను నడిపారు.