ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో వాహన సేవలు - పల్లకీలు మోసేవారు ఎక్కడి నుంచి వస్తారో తెలుసా? - SRI PADMAVATHI AMMAVARI TEMPLE

- భక్తుల పాలిట కొంగుబంగారంగా శ్రీ పద్మావతి దేవి - ఏటా వైభవంగా బ్రహ్మోత్సవాలు

Tiruchanur Palanquin Bearers Origin
Tiruchanur Palanquin Bearers Origin (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2025, 7:43 PM IST

Tiruchanur Palanquin Bearers Origin : తిరుపతిలో ఉన్న ప్రధానమైన ఆలయాల్లో తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయం కూడా ఒకటి. కలియుగంలో శ్రీ పద్మావతి దేవి, శ్రీ మహాలక్ష్మీ హంసగా, అలమేలు మంగమ్మగా ప్రసిద్ధి చెంది పూజలందుకుంటున్నారు. భక్తుల కొంగు బంగారంగా పసిడి సిరులు కురిపించే శ్రీ పద్మావతి దేవిగా కొలువైన పవిత్ర క్షేత్రం తిరుచానూరు. ఈ పుణ్య క్షేత్రాన్ని 'అలమేలు మంగాపురం'గా కూడా పిలుస్తారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి సేవ చేసుకున్న తర్వాత భక్తులు తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు.

కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమలలో కొలువై ఉన్న శ్రీనివాసునికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే, ఏటా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా కార్తిక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనలతో ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారు ఒక్కోరోజు పలు వాహనాలపై ఊరేగుతూ ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తులకు దర్శనమిస్తారు. అయితే, ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి వాహనసేవ కైంకర్యంలో పాలుపంచుకుంటున్నా వారు ఎవరో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం.

వివిధ ఉద్యోగాలు చేస్తూ :

అంగరంగ వైభవంగా కొనసాగే శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను చూడడానికి రెండు కళ్లు చాలవు. నాలుగు మాడా వీధుల్లో పల్లకీలో ఊరేగుతూ వచ్చే అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన శ్రీవైష్ణవ సంప్రదాయపరులు పాల్గొంటారు. శ్రీరంగంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు శ్రీకాంతన్‌ నేతృత్వంలో 32 ఏళ్లుగా అమ్మవారి వాహనసేవ కైంకర్యంలో పాలుపంచుకుంటున్నారు. పల్లకిని మోసేవారు మొత్తం 52 మంది ఉన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి వివిధ ప్రాంతాల్లో కొందరు ఐటీ రంగంలో, మరికొందరు బ్యాంక్, రైల్వే, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులూ ఉన్నారు.

ఎంతో భక్తితో :

అమ్మవారి పల్లకి ఎంత బరువున్నా భక్తిభావంతో పల్లకి మోస్తూ అమ్మవారి సేవలో తరిస్తున్నారు. ఒక్కో వాహనానికి మర్రి ఊడలతో తయారు చేసిన 28 అడుగుల పొడవైన 4 తుండ్లు, కొయ్యతో తయారు చేసిన 2 అడ్డ పట్టీలు, గొడుగు పలకలు, ఇద్దరు అర్చకులు, గొడుగులు పెట్టేందుకు మరో ఇద్దరు ఉంటారు. వీటన్నింటినీ కలిపితే ఒక్కో పల్లకి దాదాపు రెండున్నర టన్నులకు పైగా బరువు ఉంటుంది. ఉదయం, రాత్రి వాహన సేవల్లో ఒక్కో వాహన సేవలో దాదాపు 3 గంటలపాటు బరువును మోస్తూ వాహన బ్యారర్లు తమ భక్తిభావాన్ని చూపుతున్నారు. 3 గంటల పాటు నడుచుకుంటూ భుజం మీద మోస్తూ 4 మాడవీధుల్లో తిరగడమంటే సాధారణ విషయం కాదు. ఈ క్రమంలో భుజంపై ఉబ్బి కాయ కాసినట్లు మారినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎంతో భక్తితో అమ్మవారి సేవలో తరిస్తున్నారు.

ఉద్యోగానికి సెలవు!

తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలోనే కాకుండా, శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలోనూ వీరు ఇలాంటి సేవలు అందిస్తున్నారు. వీరు వాహనం మోసేటప్పుడు, వారి నడకలో 4 రకాలైన విధానాలు పాటిస్తారు. తద్వారా వాహనంపై ఉన్న అమ్మవారు, వాహన సేవ తిలకిస్తున్న భక్తులు తన్వయత్వం చెందుతారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభమైతే తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చేస్తారు. వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉచితంగా బస, భోజనం కల్పించి, వస్త్ర బహుమానం, ప్రయాణ ఖర్చులు చెల్లిస్తోంది.

'సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీపద్మావతి అమ్మవారిని తమ భుజస్కంధాలపై మోయడం ఎన్నో జన్మల పుణ్యఫలం. అందరికీ ఈ అవకాశం రాదు. అమ్మవారి ఆశీస్సులతోనే తమకు ఇటువంటి మహద్భాగ్యం దక్కింది' అని వాహన సేవకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ - ఇక సామాన్యులకు సులువుగా వైకుంఠ ద్వార దర్శనం

తిరుమలలో అన్నదానం చేయండిలా - స్వయంగా మీరే వడ్డించొచ్చు

ABOUT THE AUTHOR

...view details