Helping kids Cope With Exam Stress :పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పిల్లలు మంచి మార్కులు సాధించే విధంగా దగ్గరుండి చదివించాలని పిల్లలకన్నా తల్లిదండ్రులు తెగ హైరానా పడుతుంటారు. మార్చి నెల వస్తుందంటే చాలు పది, ఇంటర్, డిగ్రీ, ఇతర పోటీ పరీక్షలు ఉంటాయి. పిల్లలు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ సుబ్బారావు వివరించారు. ఆ వివరాలు మీ కోసం.
తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి ఇష్టమైన అంశాలను అందుబాటులో ఉంచి ప్రోత్సహించడం ఉత్తమం. లక్ష్యాలు విధించి మంచి ర్యాంకు తెచ్చుకోవాలని చెబితే పిల్లలు ఒత్తిడికి గురవుతారు. చదువుతో పాటు ఆటలు, పాటలు అన్నింటిలో ప్రావీణ్యం ఇప్పించి ఏ అంశంలో పట్టు సాధిస్తారో దాంట్లోనే ప్రోత్సహించడం అవసరం. అప్పుడు విజయం వారి సొంతమవుతుంది. పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా పేరెంట్స్ మాట్లాడితే వారు ఒత్తిడికి లోనవుతారు.
పిల్లలను చదువుకోమని మీరు టీవీ చూసినా :ముఖ్యంగా తల్లిదండ్రుల సమస్యలు స్టూడెంట్స్కు తెలియకూడదు. పిల్లలు అన్ని విషయాలు గమనిస్తుంటారు. పిల్లలపై వారి ప్రవర్తన ప్రభావం కచ్చితంగా పడుతుంది. పిల్లలను చదువుకోమని మీరు టీవీ చూసినా నిత్యం ఏదో ఒక విషయంలో గొడవలు పడినా వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. చదువుపై సరిగా దృష్టి సారించలేరు.
'ఇటీవల ఒక విద్యార్థి నా దగ్గరికి వచ్చారు. నీరసంగా ఉంటూ అకస్మాత్తుగా పడిపోయేవాడు. పలువురు డాక్టర్లను సంప్రదించి చివరకు నా వద్దకు తీసుకొచ్చారు. విద్యార్థి ముందే తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడేవారు. ఇది గమనించిన ఆ పిల్లాడు భయంతో నిద్రపోకపోవడం. ఆలోచనతో తినకుండా ఉండటం కారణంగా అనారోగ్యం పాలయ్యాడు. అది గమనించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన కొద్దిరోజులకు అతను మామూలు వ్యక్తిగా మారాడు.