ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మీ మెడలోని గొలుసు తాకితే మాకు అదృష్టం' -సినీఫక్కీలో పూజారికే శఠగోపం పెట్టిన దొంగలు - THIEVES STOLEN PRIEST GOLDEN CHAIN

పూజారి మెడలోని గొలుసును కొట్టేసిన దుండగులు - పూజారి గొలుసు తాకితే కలిసివస్తుందని మాయమాటలు - మరోచోట వృద్ధురాలి గొలుసుతో ఉడాయించిన దొంగలు

Thieves stolen priest chain
Thieves stolen priest chain (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2025, 6:22 PM IST

THIEVES STOLEN PRIEST GOLDEN CHAIN: పూజారుల మెడలోని గొలుసు తాకితే తమకు మంచి జరుగుతుందని నమ్మించి, తీరా ఆ గొలుసుతోనే ఉడాయించారు ఆ దొంగలు . పూజారి అమాయత్వాన్ని ఆసరాగా చేసుకుని సినీఫక్కీలో మెడలోని బంగారు గొలుసును కొట్టేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుని వద్ద నుంచి దుండగులు గొలుసు కాజేశారు. స్వామివారికి పూజ చేస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించారు.

ఆలయం గోపురం వద్దకు వచ్చి ఆశీర్వదించాలని పూజారిని కోరారు. ఆశీర్వచనం అందించిన అనంతరం పూజారి మెడలోని బంగారు గొలుసును తాకుతామంటూ దుండగులు కోరారు. పూజారుల ఒంటిపై బంగారాన్ని తాకితే తమకు కలిసొస్తుందని, మంచి జరుగుతుందని నమ్మించిన దుండగులు, గొలుసు కళ్లకు అద్దుకొని బైక్​పై అక్కడి నుంచి ఉడాయించారు. విషయం తెలుసుకుని ఆలయం వద్దకు చేరుకున్న ఇనకుదురుపేట పోలీసులు, బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ సేకరించామని, అందులో ఇద్దరు వచ్చినట్లు రికార్డు అయిందని పోలీసులు తెలిపారు. మిగిలిన సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నామని, వారిని త్వరగా పట్టుకుంటామని అన్నారు.

"దేవాలయంలో అర్చన చేసుకుని బయటకు వచ్చాను. ఇద్దరు నిలబడి మీ కాళ్లకు నమస్కరించాలి అని బయటకు రమ్మన్నారు. మీరే లోపలికి రండి అంటే, లేదు బూట్లు ఉన్నాయి, మీరే బయటకు రండి అని చెప్పారు. నేను దేవాలయం దిగి కిందకి వచ్చాను. వాళ్లు ఏదో హిందీలో మాట్లాడారు. నాకు ఏం అర్థం కాలేదు. ఏంటి అని నేను అడిగాను. అప్పుడు వాళ్లు, ఏం లేదండీ మీ కాళ్లకు దండం పెట్టుకోవాలి అని చెప్పారు. నేను సరే అన్నాను. తరువాత డబ్బులు తీసి, మీ గొలుసును తాకించండి, మాకు లాభం కలుగుతుంది అన్నారు. అలాగే తాకించాను. తరువాత వాళ్లు, అలా కాదు అని తీసిఇమ్మన్నారు. అలాగే ఇచ్చిన తరువాత వాళ్లు 100 రూపాయల నోటులో పొట్లం కట్టారు. తరువాత ఒక కవరులో వేస్తున్నామని చెప్పి వేసినట్లే వేశారు. తరువాత అందులో చూడగా ఏమీ లేదు". - పూజారి

వృద్ధురాలి గొలుసు మాయం:మరో ఘటనలో ఓ వృద్దురాలిని ఇలానే బురిడీ కొట్టించారు ఇద్దురు దొంగలు. కృష్ణా జిల్లా పామర్రు అరండల్​పేటలో సినీ ఫక్కీలో వృద్ధురాలిని మాయ చేసి నల్లపూసల గొలుసును దొంగలు చోరీ చేశారు. అరండల్​పేట రామాలయం సెంటర్లో ఏరువాక పుణ్యవతి అనే వృద్ధురాలు కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. ఆమె షాపు వద్దకు వచ్చి పక్కనే ఉన్న అమ్మవారి గుడి తలుపులు తీయాలని దుండగులు తెలిపారు. గుడి తలుపులు తీసి లోనికి యువకులు వెళ్లారు. పుణ్యవతిని కూడా లోపలికి రమ్మని దొంగలు పిలిచారు. లోనికి వెళ్లిన తర్వాత సాంబ్రాణి పుల్లలు వెలిగించి నల్ల పూసలు గొలుసు తీసి అక్కడ పెట్టమని కోరారు. నల్లపూసల గొలుసును వంద రూపాయల నోటులో చుట్టి పెట్టిన తరువాత, దానిని తీసుకుని ఉడాయించారు. దీంతో పుణ్యవతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు రోజుల పాటు రెక్కీ చేసి ఐఫోన్లు చోరీ - 24 గంటల్లోపే ఇలా దొరికేశారు!

ABOUT THE AUTHOR

...view details