These Blood Groups Prone to Heart Attacks :చాలా మంది తమ బ్లడ్ గ్రూప్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడైనా వాళ్లకు బ్లడ్ అవసరమైనప్పుడో.. లేదంటే వాళ్లే ఎవరికైనా రక్తదానం చేస్తున్నప్పుడో తప్ప.. మిగిలిన సమయాల్లో దాని ఊసే ఎవరికీ పట్టదు. కానీ.. ఇప్పుడు తప్పకుండా మీ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే.. కొన్ని బ్లడ్ గ్రూపుల వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని శాస్త్రీయ ఆధారాలు సూచిస్తున్నాయి.
బ్లడ్ గ్రూపుల్లో ప్రధాన రకాలు..
బ్లడ్ గ్రూపుల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి A, రెండోది B, మూడోది AB నాలుగో గ్రూప్ O. మాగ్జిమమ్ జనాలందరికీ ఈ నాలుగు గ్రూపుల్లోని ఏదో ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంది. మీ తల్లిదండ్రుల నుండి మీరు వారసత్వంగా పొందిన ABO జన్యువు యొక్క రూపంపై మీ బ్లడ్ గ్రూప్ ఆధారపడి ఉంటుంది.
వీరికి గుండెపోటు ప్రమాదం ఎక్కువ!
బ్లడ్ గ్రూప్‌ను ఆధారంగా చేసుకొని నిర్వహించిన పరిశోధనల్లో ఇంచుమించు ఒకే తరహా ఫలితాలు వచ్చాయి. ఇక్కడ 3 పరిశోధనల వివరాలను గమనిస్తే.. O బ్లడ్ గ్రూప్ కలిగిన వారితో పోలిస్తే.. బ్లడ్ గ్రూప్ A, బ్లడ్ గ్రూప్ B, బ్లడ్ గ్రూప్ AB రక్తం కలిగిన వ్యక్తులకు గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందట.
ఆగస్ట్ 2012లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో వేలాది మంది పాల్గొన్నారు. వారిపై జరిపిన పరిశోధన ప్రకారం.. O బ్లడ్ గ్రూప్‌తో పోలిస్తే.. AB బ్లడ్ గ్రూప్ వారికి ఏకంగా 23 శాతం అదనంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉందట. B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి 11 శాతం ఎక్కువగా ఛాన్స్ ఉందట. A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి 5% అదనంగా గుండె జబ్బుల ముప్పు ఉందని కనుగొన్నారు.