Thefts on National Highways Bapatla District : ఏపీలో కమర్షియల్ టాక్స్ అధికారుల చెకింగ్ పేరుతో జాతీయ రహదారి పక్కన కారుతో దారి దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మేదరమెట్ల స్టేషన్ పరిధిలో ఇటీవల సరకు రవాణా చేసే వాహనంలో ప్రయాణిస్తున్న బంగారు నగల వ్యాపారి స్వరూప్‌ను బెదిరించి అతని నుంచి రూ.39.50 లక్షలు అపహరించుకుపోయిన నలుగురు సభ్యుల ముఠాను 48 గంటల్లోపే పోలీసులు పట్టుకున్నారు.
Robberys In National Highways AP: కేసును మేదరమెట్ల, అద్దంకి రూరల్ పోలీసులు కలిసి ఛేదించారు. వ్యాపారిని బెదిరించి పట్టుకుపోయిన నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో గూడ్స్ ట్రాన్స్‌పోర్టులో పని చేసిన ఓ ఉద్యోగి ఈ కేసులో సూత్రధారిగా గుర్తించారు. అతనికి లారీలో సరకు పంపే వ్యాపారులపై పక్కా సమాచారం ఉందని ఆయనే ఈ దోపిడీకి వ్యూహం పన్నారని పోలీసుల విచారణలో తేలింది.
కమర్షియల్ టాక్స్ అధికారులమని దారి దోపిడీ: గుంటూరుకు చెందిన నగల వ్యాపారి తరచూ చెన్నై వెళ్తూ వస్తారు. అక్కడ బంగారు నగలు కొనుగోలు చేసి గుంటూరుకు అదే ట్రాన్స్‌పోర్టులో వస్తారు. యధావిధిగానే వ్యాపారి స్వరూప్ బంగారు నగలు కొనుగోలుకు ఈ నెల 18న రాత్రి గుంటూరులో లారీ ఎక్కారు. ఆ సరకు లారీ విజయవాడ నుంచి వస్తోంది. అక్కడి నుంచే ఆ ట్రాన్స్‌పోర్టులో పనిచేసిన మాజీ ఉద్యోగి మరో ఇద్దరితో కలిసి కారులో లారీని అనుసరిస్తున్నారు. గుంటూరులో ఈ వ్యాపారి ఎక్కగానే కొరిశపాడు ఫ్లైఓవర్‌కు సమీపంలో మాటువేసిన మరో ఇద్దరు సభ్యులకు ముందస్తు సమాచారమిచ్చి వారిని లారీ ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే రహదారికి అడ్డుగా నిలబడి తనిఖీ అధికారుల మాదిరి నటించేలా చేస్తారు. లారీ ఆగగానే వెనక నుంచి అనుసరిస్తున్న కారును ఒక్కసారిగా లారీ ముందుకు తెచ్చి పెడతారు.
లారీ నడుపుతున్న డ్రైవర్‌ను, క్యాబిన్‌లో కూర్చొన్న వ్యాపారిని కిందకు దిగాలని తాము కమర్షియల్ టాక్స్ అధికారులమని బిల్లులు చూపాలని కోరారు. కిందకు దిగగానే వ్యాపారిని పథకం ప్రకారం పి.గుడిపాడు వైపు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అక్కడ బెదిరించి బ్యాగ్‌తో సహా నగదు తీసుకుని విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించి తిరిగి లారీ వద్దకు తెచ్చి వదిలేశారు. అప్పటి దాకా లారీని అక్కడే నిలిపి డ్రైవర్‌కు ఇద్దరు వ్యక్తులు కాపలా ఉంటారు. వ్యాపారిని తీసుకురాగానే అంతా కలిసి కారులో వెళ్లిపోతారు.