Hanumakonda MRO Office Conflict : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఆవరణ ఎదుట తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. ఓ భూ వివాదంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే ఇరు వర్గాలు పరస్పరం తీవ్రమైన దాడులు చేసుకున్నాయి. దీంతో ఈ ఘర్షణలో మొత్తం 8 మందికి గాయాలు కాగా అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల సమాచారం అందుకున్న పోలీసులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేలోపే ఇరువర్గాల వారు తీవ్రంగా దాడి చేసుకుని గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో మారుపాక ఆనందం అనే వృద్ధుడి తల పగిలి తీవ్ర రక్తస్రావం అయ్యింది.
భూవివాదంలో తలెత్తిన వివాదం: పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తహసీల్దార్ కార్యాలయంలో అందరూ చూస్తుండగానే ఇరువర్గాలు చితక్కొట్టుకోవడంతో కార్యాలయ సిబ్బంది, అక్కడికి వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివాదం నడుస్తున్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓ వర్గం రాగా, విషయం తెలుసుకున్న మరో వర్గం వారు వచ్చి అడ్డుకోవడంతో గొడవ చెలరేగి పరస్పరం దాడులు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.