State Election Commission : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి పదవీ కాలం నేటితో పూర్తి కానుంది. 2020 సెప్టెంబర్ 9న ఆయన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని ఆ సమయంలో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా 2023 సెప్టెంబర్ 8తో పదవీ కాలం పూర్తైంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం పార్థసారధి పదవీ కాలాన్ని అప్పట్లో ఏడాది పాటు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం నేటితో ముగియనుంది.
పార్థసారధి పదవీకాలం : 2020 సెప్టెంబర్ 9 నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న పార్థసారధి గత నాలుగేళ్లుగా ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. మరో ఏడాది పాటు ఎస్ఈసీగా కొనసాగేందుకు ఆయనకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్థసారధిని మరో ఏడాది పాటు కొనసాగిస్తారా? లేదా? అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఆయన్ను కొనసాగించకపోతే కొత్త కమిషనర్‌ను నియమించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది.
ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ :గ్రామ పంచాయతీలు మొదలు, జిల్లా పరిషత్‌ల వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి ఎస్ఈసీ ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చింది. ఈ నెల 13న ముసాయిదా ప్రచురించి, కసరత్తు పూర్తి చేసిన తర్వాత 28న ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సి ఉంది.