Rythu Bharosa Scheme Update :రాష్ట్ర మంత్రివర్గ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చాకే, వచ్చే యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామని, ఎకరాకు రూ.7,500 చొప్పున ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రూ.2 లక్షల వరకు రుణాలుండి, నిర్ధారణ కాని రైతు కుటుంబాలను గుర్తించి, డిసెంబర్‌లోగా వారి అకౌంట్లలో నిధులు జమ చేస్తామన్నారు. రూ.2 లక్షలకుపైగా రుణాలున్న వారి కోసం షెడ్యూల్ ప్రకటించి, అర్హత గల వారికి అమలు చేస్తామని తెలిపారు. వచ్చే సీజన్ నుంచి పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఆఫీసులో ఛైర్మన్ కోదండరెడ్డితో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
"అర్హులైన ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం అందించడమే రాష్ట్ర సర్కార్ లక్ష్యం. దీనికి అనుగుణంగా కేబినెట్ సబ్ కమిటీ నివేదిక రూపొందిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు కింద కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగులో లేని భూములకు సైతం దాదాపు రూ.25 వేల కోట్లు వెచ్చించారు. మా ప్రభుత్వ హయాంలో కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఫండ్స్ జమ చేస్తాం. విధివిధానాలు ఫైనల్ కాగానే, రాబోయే పంట సీజన్ నుంచి రైతుల ఖాతాల్లో పంట సాయం వేస్తాం. పంట వేసిన వారికే నిధులు అందిస్తాం. 42 బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం మేరకు 25 లక్షల కుటుంబాల్లోని 42 లక్షల మంది లబ్ధిదారులకు రుణమాఫీకి అవసరమైన నిధులు రూ.31 వేల కోట్లు." అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేశామన్న మంత్రి తుమ్మల, ఇంకా 20 లక్షల మందికి అమలు కావాలన్నారు. తెల్ల రేషన్‌కార్డు లేని 3 లక్షల మందికి డిసెంబరులో కుటుంబ నిర్ధారణ చేసి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి రూ.2,500 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు అదనపు డబ్బులు కడితేనే మాఫీ చేస్తామని, దీనికి షెడ్యూల్ ఖరారు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో పంటల బీమాను వచ్చే యాసంగి నుంచి అమలు చేస్తామని తెలిపారు. రైతుల తరఫున సర్కారే ప్రీమియం చెల్లిస్తుందని, గత నెలలో వచ్చిన వరద నష్టాలపై ప్రైమరీ రిపోర్ట్ అందిన అనంతరం వాస్తవ నష్టాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేసిన తర్వాతే ఆ మేరకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించినట్లు గుర్తు చేశారు.