Police Seized Ganja In Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అక్రమంగా రవాణా చేస్తున్న140.585 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరించారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారంమిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు పట్టణంలో తనిఖీలు చేస్తున్న క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పట్టణ శివారు నందు రెండు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని పరిశీలించగా కారులో ఉన్న నలుగురు వ్యక్తులు పారిపోయారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లను తనిఖీ చేయగా అందులో గంజాయి లభ్యమైంది. మొత్తం 140.585 కిలోల సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న భుక్యా రామును విచారించగా సూర్యాపేట జిల్లా పెన్ పహడ్ మండలానికి చెందిన నూనవత్ జగన్, నూనావత్ మంచ్యా నాయక్‌ల ఆదేశాల మేరకు గంజాయిని తరలిస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. నిర్జన ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు సరఫరా చేసిన గంజాయిని రెండు వాహనాలలో లోడ్ చేసుకుని రవాణా చేస్తున్నట్లు వివరించాడు. నిందితుడి నుంచి గంజాయితో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.
నిందితుల కోసం గాలింపు :నిందితులను నూనవత్ జగన్(32), నూనావత్ మంచ్యా నాయక్(45), ఆంగోతు నాగరాజు(33), బాణోతు సాయి(28)లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారు. నిందితుల గురించి మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. గంజాయి రవాణాలో పట్టుబడ్డ రాముపై మరియు ఇతర నిందితులపై గతంలో కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.