తెలంగాణ

telangana

ETV Bharat / state

నాడు పాఠాలు, నేడు స్కామ్​లు - సిరిసిల్లలో రిటైర్డ్ టీచర్‌ నకిలీ సర్టిఫికెట్ల దందా - RETIRED TEACHER SCAM

పదవీ విరమణ తర్వాత ఫేక్​ సర్టిఫికెట్ల దందా చేస్తున్న ఉపాధ్యాయుడు - రిమాండ్​ ఖైదీ బెయిల్​ పత్రాలతో దొరికిన వైనం - ఏ సర్టిఫికెట్​ కావాలన్న కేరాఫ్​గా మారిన చంద్రమౌళి అనే రిటైర్డ్ టీచర్

SIRCILLA DISTRICT POLICE
FAKE CERTIFICATE SCAM (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2025, 4:52 PM IST

Retired Teacher Fake Certificates : విద్యార్థులకు నాడు పాఠాలు బోధించిన ఓ టీచర్ నేడు ప్రభుత్వ వ్యవస్థలనే మోసం చేస్తూ ఎవరూ ఊహించని విధంగా సిరిసిల్ల పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతను పిల్లలకు విద్యనందించే వృత్తిని ఎంచుకున్నాడు. కానీ ఏమైందో ఏమో పదవీ విరమణ పొందిన తర్వాత నకిలీ స్టాంపులతో ఫేక్​ సర్టిఫికెట్లు జారీ చేసే దొంగగా మారాడు. ఏ కేసులోనైనా పోలీసులు నిందితులను రిమాండ్​కు తరలిస్తే బెయిల్​కు అవసరమైన పూచీకత్తు పత్రాలు కావాలని ఈ టీచర్​ దగ్గరకు వెళ్లితే పనైపోతుందనే పేరు సంపాదించాడు.

ఏకంగా కోర్టులనే మోసం చేసే ష్యూరిటీలను సృషించడమే కాదు, బర్త్ నుంచి డెత్ వరకూ ఏ నకిలీ సర్టిఫికెటైనా సృష్టిస్తూ వ్యవస్థలనే బురిడీ కొట్టించాడు. ఇంతకాలం దొంగమార్గాల్లో డబ్బు సంపాదించి వైట్ కాలర్ ఎగురేసిన ఆ సారు ఇప్పుడు పోలీసులకు చిక్కడంతో మొత్తం బాగోతం బట్టబయలైంది.

రిటైర్డ్‌ టీచర్‌ నకిలీ సర్టిఫికెట్ల దందా (ETV Bharat)

సీరియస్​గా తీసుకున్న జిల్లా ఎస్పీ : నకిలీ ష్యూరిటీ సర్టిఫికెట్ పెట్టి రిమాండ్ ఖైదీని బెయిల్​పై బయటకు తీసుకొచ్చిన ఓ ఘటన ఈ మధ్య రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది. దానిపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సీరియస్​గా దృష్టి సారించారు. విచారణ చేసి తీగ లాగితే అవాక్కయ్యేలా డొంకంతా కదిలింది. సిరిసిల్ల గాంధీనగర్​కు చెందిన సిరిపురం చంద్రమౌళి ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు. ఇప్పుడు నకిలీ స్టాంపులతో వ్యవస్థల కళ్లుగప్పుతున్న కేటుగాడు. తహశీల్దార్లు, రిజిస్ట్రార్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, గ్రామపంచాయితీ సెక్రటరీలతో పాటు కొందరు వీవీఐపీల స్టాంపులు సైతం కావాలన్నా అవి చంద్రమౌళి దగ్గర లభ్యమవుతాయి.

ఈ మధ్యే ఈ స్కామ్​ను గుర్తించాము. ఈ కేసులో ఏ1 చంద్రమౌళి నేరాలకు పాల్పడ్డాడు. ఆయన నిర్మల్​ జిల్లా నుంచి ఉపాధ్యాయ విరమణ పొందాడు. తహసీల్దార్​, అసిస్టెంట్ సర్జన్​, పంచాయతీ సెక్రటరీ, వీఐపీల పైరుతో కొన్ని స్టాంప్స్​ను క్రియేట్​ చేశాడు. ఇతను ఫేక్​ సర్టిఫికెట్స్​ ఎవరెవరికి ఇచ్చారని తెలుసుకుంటాం. దీనిపై ఇంకా విచారణ చేస్తున్నాం - అఖిల్​ మహజన్​, ఎస్పీ రాజన్న సిరిసిల్ల

ఏ సర్టిఫికెట్​ కావాలన్న సరే : స్కూల్​లో ఇచ్చే కండక్ట్ సర్టిఫికెట్స్, ఆసుపత్రుల్లో ఇచ్చే మెడికల్ సర్టిఫికెట్స్, కళ్యాణలక్ష్మి వంటి పథకాలకు సమకూర్చుకునే పత్రాలు ఇలా ఏవైనా నకిలీ చేయడంలో చంద్రమౌళి సిద్ధహస్తుడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫోర్జరీలకు కేరాఫ్. రిటైర్డ్మెంట్ తర్వాత చంద్రమౌళి ఇలా యాంటీ సోషల్ దందాను ఎంచుకుని తన ఉపాధ్యాయ వృత్తి జీవితంలో సంపాదించినదానికంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడు.

కోర్టు కేసులో రిమాండ్​కు వెళ్లిన ఓ నిందితుడికి ష్యూరిటీ సర్టిఫికెట్ విషయంలో తలెత్తిన అనుమానంతో చంద్రమౌళి దొరికాడేగానీ లేకపోతే, ఇంకెన్ని వ్యవస్థల్ని బురిడీ కొట్టించేవాడో అంతుచిక్కడం లేదు. మొత్తం మీద సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం చంద్రమౌళిపై కేసు నమోదు చేసి ఇంటరాగేషన్ చేస్తే తనతో పాటు ప్రకాష్, శివాజీ, రాకేష్ మరో ముగ్గురు సహకరిస్తున్నట్టు తేలింది.

తహసీల్దార్​ స్టాంపులు కూడా : నకిలీ సర్టిఫికెట్స్ మాఫియాగా మారిన చంద్రమౌళితో పాటు ఈ కేసులో రాకేష్, శివాజీ, ప్రకాష్​, అనంతపల్లి మాజీ ఉపసర్పంచ్ బాబు, విష్ణు అనే ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్పీ అఖిల్​ మహజన్​ వెల్లడించారు. శీలం రాజేష్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరి నుంచి సిరిసిల్ల తహసీల్దార్ పేరుతో నకీలీ స్టాంప్స్ కలిగిన కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలు, బోయినపల్లి తహసీల్దార్ స్టాంపులు, ఇంటి విలువకు సంబంధించిన ధృవపత్రాలు, పెన్నులు, భూతద్దాలు, మొబైల్స్​, పాలీ స్టాంపర్, స్టాంప్ ప్యాడ్స్, స్టాంపులు తయారుచేసే మిషన్, స్టాంప్ ముట్టీలు, రెండు వైపులా అంటించే స్టాంప్ షీట్స్, సిలికాన్ షీట్, స్టాంప్ సొల్యూషన్ కెమికల్ డబ్బా ఇవన్నీ స్వాధీనపర్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పరోక్షంగా నేరం చేసినట్లే : చైతన్యవంతమైన, ఒక సభ్య సమాజాన్ని తయారుచేసే వృత్తిలో ఇన్నాళ్లూ కొనసాగి ఇప్పుడు ఆ సమాజాన్నే తప్పుదోవ పట్టించే నేరాలకు పాల్పడ్డ ఓ ఉపాధ్యాయుడి కథ సంచలనం రేపుతుంది. అయితే, ఇలాంటి నేరాలు చేసేవారితో పాటు ఇలాంటి వారిని ఆశ్రయించేవారూ పరోక్షంగా నేరాలకు పాల్పడుతన్నట్లే అని ఎస్పీ తెలిపారు. వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.

ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల అడ్డదారులు - అర్హత లేకున్నా ఈడబ్ల్యూఎస్​ సర్టిఫికెట్ల​ సమర్పణ - Telangana DSC Counseling 2024

నకిలీ మెడికల్​ సర్టిఫికెట్లు స్కామ్​.. తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు

ABOUT THE AUTHOR

...view details