Children Behavior Problems : 'మా పిల్లలు మాట వినడం లేదు. ఎవరితో మాట్లాడటం లేదు. లేనిపోని అలవాట్లు నేర్చుకుంటున్నారు.' అంటూ పలువురు తల్లిదండ్రులు ఈ మధ్య ఆసుపత్రికి వస్తున్నారు. ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ బాలిక, తల్లిదండ్రులు సెల్‌ఫోన్ అడిగితే ఇవ్వలేదని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ తండ్రి ఇంట్లోనే మద్యం, సిగరెట్ తాగేవాడు. దీనిని రోజూ చూసిన తొమ్మిదో తరగతి బాలుడు తానూ తాగడం మొదలుపెట్టాడు.
ఏమీ తెలియని పసివాడు పది మందిలోనైనా కన్నతల్లిని గుర్తిస్తాడు. తల్లిదండ్రుల స్పందనలే ఎదిగే పిల్లలపై ప్రభావం చూపుతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. సర్దుబాటు చేసుకోలేక చీటికి మాటికీ భార్యాభర్తల మధ్య చోటుచేసుకుంటున్న వాగ్వాదాల సంఘర్షణలో క్రమశిక్షణ కలిగిన పిల్లలను మనం ఊహించలేం. తల్లిదండ్రులనే ఎప్పుడూ గమనించే చిన్నారులు, ఉత్తమ పౌరులుగా తయారు కావడం లేదంటే అందుకు కారణం తల్లిదండ్రులే. ఆత్మావై పుత్రనామాసి అంటున్న వేద ఘోష మన చెవికెక్కేదెన్నడు?
పిల్లల ముందు ఇలా చేయకండి: పిల్లల ముందు గొడవలు పడటం, కొట్టుకోవడం, తిట్టుకోవడం చేయవద్దు. గట్టిగా మాట్లాడటం కూడా చేయకూడదు. ఎందుకంటే ఇంట్లోని వాతావరణం ప్రశాంతంగా ఉండి ప్రేమలు ఉంటే మంచి పిల్లలు రూపుదిద్దుకోవడాన్ని మనం చూడవచ్చు. అమ్మా నాన్నలు ప్రేమగా ఉన్నారా? ఎవరు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారనే విషయాలు చిట్టి బుర్ర గుర్తు పెట్టుకుంటుంది. ఏదైనా తేడా అనిపిస్తే పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి.
కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రత్యేకం, టాలెంట్ అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. కానీ పిల్లలను స్పెషల్‌గా చూడటం కాదు. వాళ్లు సెక్యూర్‌గా ఫీలవ్వాలి. ఇతరుల ముందు గొప్పగా వారి విజయాల గురించి చెప్తారు. దాంతో పిల్లలు ఒకలాంటి అభద్రతా భావంలోకి వెళ్లిపోతారు. ఈ విజయాలు సాధించకపోతే అమ్మానాన్నలు అసహ్యించుకుంటారనే దిగులు పడతారు. పిల్లల గెలుపును కాకుండా, వారు చూపే చొరవను ప్రశంసిస్తే బాగుంటుంది.