Jala Mandali On Hyderabad Sewage System :హైదరాబాద్ మహానగరంలో మురుగు నీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పటిష్ట చర్యలు చేపట్టి రోజూ ఉత్పత్తయ్యే మురగును వంద శాతం శుద్ధి చేయడానికి వీలుగా ఎస్టీపీ లను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా మొత్తం 3 ప్యాకేజీల్లో 3 వేల866 కోట్ల రూపాయల వ్యయంతో 1,259 ఎమ్ఎల్డీల సామర్థ్యం గల 31 కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.వాటి నిర్మాణ బాధ్యతను జలమండలికి అప్పగించింది.
100 శాతం మురుగును శుద్ది చేసే తొలినగరంగా :మొత్తం 5 సర్కిళ్లలో ఈ ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది. వాటి నిర్మాణం పూర్తై అందుబాటులోకి వస్తే రోజూ ఉత్పన్నమయ్యే మురుగును 100 శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుందని జలమండలి భావిస్తోంది.
8 STPs At A Cost Of Rs.1280 Crores :ప్యాకేజీ-1 లో అల్వాల్, మల్కాజ్‌గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో 1230 కోట్ల రూపాయలతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వాటి ద్వారా 402.50 ఎమ్ఎల్డీల మురుగు నీటిని శుద్ధి జరుగుతుంది. ప్యాకేజీ-2 లో రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాతాల్లో 1355 కోట్ల రూపాయలతో 6 ఎస్టీపీలను నిర్మించనున్నారు. ఇక్కడ 480.50 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.
6 ఎస్టీపీల నిర్మాణం పూర్తి :ప్యాకేజీ-3 లో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో 1280 కోట్ల రూపాయల వ్యయంతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేసి 376.50 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు. ఇప్పటికే కోకాపేట, దుర్గం చెరువు, పెద్ద చెరువు, నల్ల చెరువు వద్ద నిర్మించిన 4 ఎస్టీపీలు ప్రారంభం కాగా మరో 6 ఎస్టీపీలు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమయ్యాయి.