ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 1:43 PM IST

ETV Bharat / state

'పచ్చని ఎన్నికల'తో ప్రజాస్వామ్యానికి మరింత శోభ- టన్నుల కొద్దీ వ్యర్థాలతో పర్యావరణ ముప్పు - Eco Friendly Polling in India

Eco Friendly Polling in India : దేశవ్యాప్తంగా ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. భారీ ర్యాలీలు, సభలతో నేతలు మాటల తూటాలు పోటీపడుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్‌లతో రహదారులు నిండిపోతున్నాయి. ఈ ఎన్నికల వేడుక చూడటానికి కన్నులపండువగా ఉన్నా పర్యావరణంపై పడే ప్రభావం గురించి పెద్దగా ఆలోచించడంలేదు. పుడమికి హాని కలిగించే ఎన్నికల పోకడలకు స్వస్తి పలకాల్సిన ఆవశ్యకతపై దృష్టి సారించడంలేదు. ప్లాస్టిక్‌ ప్రచార సామగ్రి స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన విధానాలను ప్రవేశపెట్టాలని నిపుణలు సూచిస్తున్నారు. ‘హరిత ఎన్నికలు’ ప్రజాస్వామ్యానికి మరింత శోభ తెస్తాయంటున్నారు.

Eco Friendly Polling in India
Eco Friendly Polling in India (Etv Bharat)

Eco Friendly Polling in India : 2016లో నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం కోసం ఒక అభ్యర్థి చేపట్టిన విమాన ప్రయాణాలు 500 మంది అమెరికన్లు ఓ సంవత్సరం పాటు పర్యావరణంపై మోపిన భారంతో సమానమని ఓ పరిశీలనలో తేలింది. ఈ లెక్కన 96 కోట్ల మంది ఓటర్లతో కూడిన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యుత్‌, ఇతర ఇంధనాలను విపరీతంగా వాడేసే భారీ ర్యాలీలు, పోటాపోటీగా జనసమీకరణాలు, ధ్వని కాలుష్యం కలిగించే లౌడ్‌ స్పీకర్లు మనదేశంలో ఎలక్షన్స్​కు కేరాఫ్​ అడ్రెస్​​గా మారాయి. దీనికితోడు ప్రచారంలో పీవీసీ ఫ్లెక్స్‌ బ్యానర్లు, హోర్డింగ్‌లు, పోస్టర్లు, కటౌట్లు, ప్లాస్టిక్‌తో తయారైన ప్రచార సామగ్రి, ఒకసారి వాడిపారేసే వస్తువుల వాడకం భారీగా ఉంటోంది.

  • ఎన్నికల తర్వాత అవి డ్రైనేజీ, నదీ వ్యవస్థల్లోకి చేరుతున్నాయి. దీనివల్ల నీరు, నేల కలుషితమవుతున్నాయి. పాలీవినైల్‌ క్లోరైడ్‌ ఆధారిత ప్లాస్టిక్‌లను కాల్చివేయడం వల్ల విష వాయువులు బయటకు వస్తున్నాయి.
  • దీనికితోడు దేశవ్యాప్తంగా పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు, అక్కడికి పోలింగ్‌ సామగ్రి, బలగాల తరలింపు, ఓటర్లు ఎన్నికల కేంద్రాలకు వెళ్లడానికి భారీగా వాహనాలు వాడాల్సి వస్తోంది. ఎన్నికల ప్రచారంలో సైతం పెద్ద సంఖ్యలో వాహనాలను వాడుతున్నారు. ఇంధనాన్ని అధికంగా వాడేసే ఎస్‌యూవీ కార్ల వైపు అభ్యర్థులు ఎక్కువగా మొగ్గుతున్నారు.
  • లీటరు డీజిల్‌ వల్ల వాతావరణంలోకి సుమారు 2.7 కిలోల కార్బన్‌ డైఆక్సైడ్‌ విడుదలవుతుంది. ఈ లెక్కన ఎన్నికల వల్ల దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల కిలోల ఉద్గారాలు వెలువడతాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలిగిస్తాయి.

ఎన్నికలు మినహాయింపు కాదు

  • దేశ జనాభాలో 80 శాతం మంది వాతావరణంతో కలిగే విపత్తుల ముప్పు అధికంగా ఉన్న జిల్లాల్లో నివసిస్తున్నారని గత నవంబరులో వరల్డ్​ బ్యాంకు విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది.
  • వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమవుతున్న ప్రతికూల పరిస్థితుల వల్ల భారతదేశంలో 90 లక్షల మందికిపైగా ఇబ్బంది పడుతున్నారని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నివేదిక చెబుతోంది.
  • ఈ నేపథ్యంలో ప్రతి అంశంలోనూ పర్యావరణ అనుకూల విధానాలు అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది. ఎన్నికలూ ఇందుకు మినహాయింపు కాదు.

ప్రయోజనాలు

  • హరిత ఎలక్షన్స్​ వల్ల ఇతర రంగాల్లోనూ మరిన్ని పర్యావరణ అనుకూల విధానాలను అనుసరించడానికి మార్గం సుగమమవుతుంది.
  • ప్రజారోగ్య రంగానికి మేలు జరుగుతుంది. ధ్వని కాలుష్యం తగ్గుతుంది. వాయు నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
  • హరిత ఎన్నికల దిశగా వెళ్లే క్రమంలో ప్రారంభంలోనే ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. అయితే కాలక్రమంలో వ్యయాలు తగ్గుతాయి. ఎన్నికల తర్వాత వ్యర్థాల సేకరణ, నిర్వహణకు అయ్యే భారం కూడా తగ్గుతుంది.

నవతరానికి ఇది ప్రాధాన్యం

గత కొన్ని సంవత్సరాలపాటుగా చోటు చేసుకుంటున్న అసాధారణ వాతావరణ పోకడలను భారతదేశం గుర్తించింది. మొదటిసారి ఓటేస్తున్న 1.8 కోట్లమందికి వాతావరణ మార్పులు అనేది మూడో ముఖ్యమైన సామాజిక అంశమని గత ఏడాది డెలాయిట్‌ సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.

ఏం చేయాలి?

ఎన్నికల ప్రచారంలో సామగ్రిలో ప్లాస్టిక్‌/ పాలిథీన్‌ వాడకం వద్దని ఎన్నికల సంఘం (ఈసీ) 1999 నుంచి పార్టీలకు సూచిస్తోంది. అయినా వాటి వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. హరిత ఎన్నికల దిశగా ప్రచార వస్తువల నుంచి ర్యాలీలు, పోలింగ్‌ బూత్‌ల వరకూ అన్ని దశల్లోనూ పర్యావరణ అనుకూల విధానాలను అనుసరించాల్సి ఉంటుంది. ఇందుకు నిపుణుల సూచనలివీ

  • హరిత ఎన్నికల దిశగా పరివర్తనలో పార్టీలు, ఈసీ, ప్రభుత్వాలు, ఓటర్లు, పౌర సమాజం భాగస్వామ్యంగా ఉండాలి.
  • పర్యావరణ అనుకూల ఎన్నికల విధానాలను తప్పనిసరిగా చేస్తూ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించాలి. ఎన్నికల నియమావళిలో దీన్ని భాగం చేయాలి.
  • భారీ ర్యాలీలను తగ్గించి, డిజిటల్‌ వేదికలు, వర్చువల్‌ ప్రచారాలకు, ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • అందరూ పర్యావరణహిత వాహనాలను వాడాలి. కార్‌ పూలింగ్‌, ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలి.
  • అధికారులు, ఓటర్లు ప్రయాణించే దూరాన్ని తగ్గించేలా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
  • ప్లాస్టిక్‌ను పూర్తిగా నివారించి పర్యావరణ అనుకూల వస్త్రం, రీసైకిల్డ్‌ కాగితం, కంపోస్టబుల్‌ ప్లాస్టిక్స్‌ వంటి ప్రత్యామ్నాయాలను వాడేలా చూడాలి. పోలింగ్‌ బూత్‌లలోనూ వీటినే ఉపయోగించేలా చూడాలి. వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, పారవేయడం సరిగా జరగాలి.
  • ఓటర్ల జాబితా, ఎన్నికల సరంజామా కోసం కాగితం వినియోగాన్ని తగ్గించుకోవాలని. ఈ-బుక్స్‌, ఈ-డాక్యుమెంట్లను ఎక్కువ వాడాలి.

డిజిటల్‌ ఓటింగ్‌తో

ఎన్నికల్లో కర్బన ఉద్గారాలకు ప్రధాన వనరు ఓటర్లు, ఎన్నికల సామగ్రిని పోలింగ్‌ బూత్‌ల వరకూ తీసుకెళ్లడం, ఆ తర్వాత వెనక్కి తరలించడానికి ఉపయోగించే రవాణా వ్యవస్థలేనని ఒక పరిశోధన చెబుతోంది. పోలింగ్‌ బూత్‌ల నిర్వహణ రూపేణా కూడా పర్యావరణంపై భారం పడుతోందని చెబుతోంది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్‌ ఓటింగ్‌ వ్యవస్థను తెరపైకి తెస్తే ఎన్నికల సంబంధ కర్బన ఉద్గారాలు 40శాతం వరకూ తగ్గొచ్చని వెల్లడైంది.

డిజిటల్‌ ఓటింగ్‌కు భారత ఎన్నికల సంఘం ప్రయత్నించాలి. ఈ దిశగా అనేక సవాళ్లు ఉన్నమాట నిజమే. మౌలిక వసతులు అవసరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటిని విస్తృతంగా ఏర్పాటు చేయాలి. హ్యాకింగ్‌, ఇతర మోసాలు జరగకుండా చూడాలి. అధికారులకు శిక్షణ ఇవ్వాలి. డిజిటల్‌ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లందరూ సమాన స్థాయిలో పాలుపంచుకునేలా చూడటానికి ప్రభుత్వం కృషి చేయాలి.

పర్యావరణహిత ఎన్నికల అడుగులు

  • 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులను ప్రచారంలో ఉపయోగించొద్దని కేరళ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. ఆ దిశగా ఫ్లెక్స్‌, నాన్‌ బయోడిగ్రేడబుల్‌ వస్తువులను ఎన్నికల ప్రచారంలో వాడొద్దని కేరళ హైకోర్టు కూడా నిషేధం విధించింది. దీంతో గోడలపై బొమ్మలు, కాగితపు పోస్టర్లు ప్రత్యామ్నాయాలుగా వచ్చాయి. చేతితో తయారైన కాగితపు పెన్నులు, పేపర్‌ బ్యాగ్‌లను ఎన్నికల ప్రక్రియలో వాడారు.
  • 2022లో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ రాష్ట్రం జీవవైవిధ్య బోర్డు పర్యావరణానికి అనుకూలంగా ఎన్నికల పోలింగ్​ బూత్​లను ఏర్పాటు చేసింది. స్థానిక సత్తారి, పోండాకు చెందిన కళాకారులు కొబ్బరి చిప్పలు, తాటి చెట్లు, వెదురు, వరిపొట్టుతో వీటిని అద్భుతంగా రూపొందించారు.
  • 2019లో శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ)పార్టీ ప్రపంచంలోనే తొలిసారిగా పర్యావరణహిత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ఎన్నికల ప్రచారాల్లో వాడిన వాహనాలు, ఖర్చయిన విద్యుత్‌ వల్ల వెలువడిన ఉద్గారాలను ఆ పార్టీ లెక్కించింది. దీనికి బదులుగా ప్రతి జిల్లాలోనూ నిర్దేశిత సంఖ్యలో చెట్లను నాటింది.

ABOUT THE AUTHOR

...view details