Discussion on Various Issues in AP Legislative Council: శాసన మండలిలో కూటమి నేతలు, వైఎస్సార్సీపీ నేతల మధ్య పలు అంశాలపై వాదోపవాదాలతో మాటల యుద్ధం సాగింది. రుషికొండ నిర్మాణాలు, శారదా పీఠం భూముల కేటాయింపు, మదనపల్లె దస్త్రాల దహనంపై చర్చలతో మండలి అట్టుడికింది. వైఎస్సార్సీపీ పాలనలో సాగిన అక్రమాలను ఎండగడుతూ మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అలజడి సృష్టించే ప్రయత్నం: శాసన మండలిలో సమావేశాలు మొదలైన వెంటనే వైఎస్సార్సీపీ సభ్యులు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, 108, 104 ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వాటిని తిరస్కరించిన ఛైర్మన్ మోషెన్ రాజు మరో ప్రతిపాదనతో వస్తే పరిశీలిస్తామన్నారు. విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి పలువురు సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో ఆందోళన చేపట్టిన వైఎస్సార్సీపీ సభ్యులు ఛైర్మన్ పొడియాన్ని చుట్టుముట్టి వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టారు. స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు 104, 108 మీద మండలిలో చర్చకు సిద్ధమని తెలిపారు. ఎప్పుడు చర్చించాలనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఛైర్మన్ హామీ ఇవ్వడంతో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి.
వాటర్ గ్రిడ్ తరహాలో డంపింగ్ యార్డులు ఏర్పాటు: పవన్ కల్యాణ్
విలాసవంతమైన భవనాలపై మాటల యుద్ధం: విశాఖలోని రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన విలాసవంతమైన భవనాల అంశమూ మాటల యుద్ధానికి దారితీసింది. రుషికొండపై పర్యాటకానికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రిసార్టుల కోసమని అనుమతులు తీసుకుని సీఎం క్యాంపు కార్యాలయం కోసమని జీవో జారీ చేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో మంత్రి అచ్చెన్నాయడు జోక్యం చేసుకుని రుషికొండ నిర్మాణాలకు పెట్టిన ఖర్చుతో 26 వేల మంది పేదవారికి ఇళ్లు కట్టించవచ్చన్నారు.
గురుదక్షిణ కోసం భూములు: గత వైఎస్సార్సీపీ సర్కార్ శారదా పీఠానికి భూములు కేటాయించడంపై మండలిలో వాడీవేడీగా చర్చ సాగింది. ప్రజావసరాల కోసం కాకుండా గురుదక్షిణ కోసం విలువైన భూముల్ని కారు చౌకగా కేటాయించారని మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయడు ధ్వజమెత్తారు. గురుదక్షిణ లాంటి పదాలు వాడటం సరికాదని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గురువుకిచ్చే దాన్ని గురుదక్షిణే అంటారంటూ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ పాలనలో భూ దందాలు బయటకొస్తాయనే మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు తగులబెట్టారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. దస్త్రాల దహనానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కీలక బిల్లులు - ఆమోదించిన సభ
పోలీసుల విచారణకు వర్మ డుమ్మా - వాట్సాప్‌లో ఏం మెసేజ్ చేశారంటే!