CM Chandrababu on Roads Pilot Project: రాష్ట్రంలో రహదారుల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నప్రతిపాదన చేశారు. రహదారుల నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తే బాగుంటుందని అన్నారు. సభలో సభ్యులంతా ప్రశంసించడంతో, ప్రజలకు నచ్చజెప్పే బాధ్యత తీసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తానని సీఎం అన్నారు.
పవర్ నెట్వర్కింగ్, వాటర్ నెట్వర్కింగ్తో పాటు రహదారుల నెట్వర్కింగ్ కూడా చేయాలని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో లక్షల కొద్దీ గుంతలు పడ్డాయని శాసనసభలో సీఎం వ్యాఖ్యానించారు. 2025 జనవరి నాటికి గుంతలు రహిత రహదారులతో ఏపీ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
జగన్ విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని సీఎం ధ్వజమెత్తారు. ఇటుక ఇటుక పేర్చి రాష్ట్రాన్ని పునర్మిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఎవరి దగ్గరా మంత్రదండాలు ఉండవని, కష్టించి పనిచేయాల్సిందేనని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సంక్రాంతికి గ్రామాలకు వచ్చే ఏపీ వాసులకు, పొరుగు రాష్ట్రాల వారికీ ఏపీ రోడ్లే సమాధానం చెబుతాయని వెల్లడించారు.
రోడ్లపై గుంతలు పూడ్చేందుకు 850 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు సీఎం వెల్లడించారు. రాష్ట్రం వద్ద డబ్బులు లేకపోయినా ఆలోచనలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా పీపీపీ (public private partnership) విధానంలో రహదారుల నిర్మాణం చేపడతామని సీఎం ప్రతిపాదించారు. రహదారుల నిర్మాణం చేసి, హైవేల తరహాలో రాష్ట్ర రోడ్లపై టోల్ వసూలు చేద్దామని ప్రతిపాదించారు. గ్రామాల నుంచి మండలాల వరకు టోల్ ఉండబోదన్న సీఎం, బైక్‌లు, ఆటోలకు, ట్రాక్టర్లకు టోల్ వర్తించబోదని అన్నారు.
రాష్ట్ర రోడ్లకు టోల్ విధింపు: రాష్ట్ర రోడ్లకు టోల్ విధింపుపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు సీఎం అడిగారు. ప్రజలను ఒప్పించగలిగితే రోడ్లు బాగుపడతాయని అన్నారు. టోల్ ప్రతిపాదన వద్దంటే గుంతల రోడ్లపైనే తిరగాల్సివస్తుందని వ్యాఖ్యానించారు. కార్ల నుంచి భారీ వాహనాల వరకూ కొంత మొత్తంలో టోల్ వసూలు చేసి కొత్త రహదారులు నిర్మాణం చేద్దామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అవసరమైతే రహదారులకు ప్రభుత్వమే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం ప్రతిపాదన బావుందంటూ ఏకాభిప్రాయంగా చేతులెత్తి శాసనసభ్యులు ఆమోదం తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో ప్రకాశం జిల్లాను కూడా చేర్చాలంటూ ఆ జిల్లా శాసనసభ్యులు విజ్ఞప్తి చేశారు.
2027లోపు పోలవరం పూర్తి - జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు: సీఎం చంద్రబాబు
ఏపీలో 85 వేల కోట్ల పెట్టుబడులు - 10 భారీ పరిశ్రమలకు లైన్ క్లియర్