Maoist Encounter Case :ఏటూరు నాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. భోజనంలో మత్తుపదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని, చిత్రహింసలకు గురిచేసి కాల్చిచంపారని న్యాయస్థానానికి తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని న్యాయవాది కోర్టులో వాదించారు. కనీసం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం చేశారన్నారు. ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా మావోయిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించారని హైకోర్టుకు తెలిపారు.
అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ, పోలీసులు భద్రత దృష్ట్యా మృతదేహాలను ఆసుపత్రికి తరలించామని కోర్టుకు తెలిపారు. కేఎంసీ వైద్య నిపుణుల ఆధ్వర్యంలోనే పోస్టుమార్టం నిర్వహించారని స్పష్టం చేశారు. పోస్టుమార్టం ప్రక్రియను మొత్తం వీడియో తీశారని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. అలాగే మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని తెలిపింది. ఈ విషయంపై తదుపరి విచారణను రేపటికి(03-12-2024)కి హైకోర్టు వాయిదా వేసింది.
డీజీపీ ప్రెస్ నోట్ : మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. మావోయిస్టులపై విషపదార్థాలు ప్రయోగించారనేది దుష్ప్రచారమని అన్నారు. మావోయిస్టులు స్పృహ కోల్పోయాక కాల్పులు జరిపామనడం అవాస్తమని తెలిపారు. వారు అత్యాధునిక ఆయుధాలతో పోలీసులపై కాల్పులు జరిపారని వివరించారు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో, పోలీసులు ఎదురు తిరిగి కాల్పులు జరపడంతో ఏడుగురు మావోయిస్టులు మరణించారని వెల్లడించారు. హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీ సూచనల మేరకు శవపరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు అధికారిగా వేరే జిల్లా డీఎస్పీని నియమించినట్లు డీజీపీ జితేందర్ ప్లెస్ నోట్లో వివరాలు వెల్లడించారు.