Telangana Budget on 25th of this Month : బడ్జెట్ ప్రతిపాదనలను చర్చించి అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు అనుమతి ఇవ్వడం కోసం రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 25న సమావేశం కానుంది. ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అదే రోజున అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు వీలైనంత త్వరగా కచ్చితమైన సమగ్ర సమాచారంతో సమాధానాలు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు సమన్వయ, సమాచార లోపం లేకుండా సీనియర్ అధికారులు అసెంబ్లీలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు.
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 25న ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఆ తర్వాత రోజుల్లో వివిధ శాఖల డిమాండ్లపై చర్చ ఉంటుందన్నారు. నోట్ ఆన్ డిమాండ్ రూపొందించి బడ్జెట్‌ను సిద్ధంగా ఉంచాలని, మంత్రులు, సభ్యులు దానిని పరిశీలించి చర్చకు సంబంధించిన విషయాలను లేవనెత్తడానికి తగిన సమయం ఉంటుందని ఆయన అధికారులను కోరారు. సమావేశంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.