Nellore Residential School Student Missing :తనను బాగా చూసుకోవడం లేదని, తన కంటే చెల్లినే బాగా చూసుకుంటున్నారని మనస్తాపానికి గురైన ఓ బాలుడు వసతి గృహం నుంచి వెళ్లిపోయిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నెల్లూరు జిల్లా కావలిలోని ఓ దంపతులకు ఇద్దరు పిల్లలు. తమ కుమారుడిని నెల్లూరు గ్రామీణ మండలంలోని దేవరపాలెం గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదివిస్తున్నారు. తల్లిదండ్రులు తన కంటే చెల్లికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, తనను సరిగా చూసుకోవడం లేదని గత కొంతకాలంగా మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వసతి గృహం నుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు తల్లిదండ్రులకు లెటర్ రాశాడు. "నా కంటే చెల్లిని బాగా చూసుకుంటున్నారు. నన్ను సరిగా చూసుకోవడం లేదు. ఇంట్లో స్కూల్ ట్యాబ్ ఉంది. దాన్ని స్కూల్లో అప్పగించాలి. మీరు ఏం టెన్షన్ పడొద్దు. రెండు సంవత్సరాల్లో తిరిగి వచ్చేస్తా" అని లేఖ రాశాడు. దీంతో గురుకుల పాఠశాల సిబ్బంది బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు బాధిత తల్లిదండ్రులు బుధవారం నెల్లూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
పిల్లల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోందా? - విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రుల నిఘా తప్పనిసరి!