TGSRTC MD Sajjanar Fire On Social Media Influencers :సామాజిక మాధ్యమాల్లో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు వత్తాసు పలుకుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ చేస్తూ వేలు, లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకొని, డబ్బులకు కక్కుర్తిపడి విదేశీ బెట్టింగ్, ఆన్‌లైన్ పందేలు తదితర యాప్‌లకు ప్రచారం చేస్తూ యువతను తప్పుదోవపట్టిస్తున్నారు. రాష్ట్రంలో వీటిపై నిషేధమున్నా అవేవీ పట్టనట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రచార మోజులో పడి గ్యాంబ్లింగ్‌కు అలవాటై వేలాది మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఏం చేసిన నడుస్తుందని అనుకుంటే పొరపాటు :విదేశీఆన్ లైన్ బెట్టింగ్, గేమ్ంగ్ యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే హెచ్చరిక చేసింది. మీ ఇన్ప్లూయెన్స్తో అమాయకుల జీవితాలు బలి చేయవద్దని సూచించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. యువతను ఆన్‌లైన్ పందేలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం శిక్ష పడుతుందని హెచ్చరించారు. అయినా కొంత మంది ఇన్‌ప్లూయెన్సర్లు తమ స్వలాభం కోసం ఇష్టారీతిన ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని వివరించారు. గుర్తు పెట్టుకోండి మీరంతా శిక్షార్హులు అని తెలియజేశారు.