తెలంగాణ

telangana

ETV Bharat / state

టిక్కెట్​ ఛార్జీల పెంపుపై తెలంగాణ ఆర్టీసీ క్లారిటీ - కేవలం ఆ బస్సుల్లో మాత్రమేనట!

రాష్ట్రంలో బస్సు ఛార్జీలు పెరగనున్నాయా? - క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ - టిక్కెట్ల పెంపుపై దుష్ప్రచారం జరుగుతోందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటన విడుదల

TGSRTC Clarity On Bus Charges Hike
TGSRTC MD Sajjanar Clarity On Bus Charges Hike (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 9:32 PM IST

Updated : Nov 4, 2024, 9:58 PM IST

TGSRTC MD Sajjanar Clarity On Bus Charges Hike: టీజీఎస్ ఆర్టీసీ బ‌స్సు టికెట్ ధ‌ర‌లను పెంచింద‌ని జ‌రుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌లకు సాధార‌ణ ఛార్జీలే అమ‌ల్లో ఉన్నాయని ఆర్టీసీ వెల్లడించింది. దీపావ‌ళి తిరుగు ప్రయాణ ర‌ద్దీ నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఛార్జీల‌ను సంస్థ స‌వ‌రించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు. సామాజిక మాధ్యమాల్లో ఆర్టీసీ టికెట్ ధరలు పెరిగినట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

సాధారణ బస్సు ఛార్జీలను, స్పెషల్ బస్సు ఛార్జీలను కలిపి చూపిస్తూ ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ప్రధాన పండుగలు, ప్రత్యేక సంద‌ర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతోందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఆ బ‌స్సులు ఖాళీగా వెళ్తుంటాయని, ఆ స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని వీసీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.

గ‌త 21 ఏళ్లుగా అన‌వాయితీగా వ‌స్తోన్న ప్రక్రియ :పండుగ‌లు, ప్రత్యేక సంద‌ర్భాల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్రమే రూ.1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను స‌వ‌రించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చిందన్నారు. ఇది గ‌త 21 ఏళ్లుగా అన‌వాయితీగా వ‌స్తోన్న ప్రక్రియ అని యాజమాన్యం ప్రకటించింది. దీపావ‌ళి పండుగ స‌మ‌యంలో రెగ్యుల‌ర్ స‌ర్వీసుల ద్వారానే ప్రయాణికుల‌ను సొంతూళ్లకు చేర్చడం జ‌రిగింది. కానీ తిరుగు ప్రయాణంలో క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, త‌దిత‌ర ప్రాంతాల నుంచి హైద‌రాబాద్​కు ర‌ద్దీ ఎక్కువ‌గా ఉందని, ఈ నేప‌థ్యంలో ఆదివారం, సోమ‌వారం నాడు ర‌ద్దీకి అనుగుణంగా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌ నుంచి హైద‌రాబాద్‌కు ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డపాల‌ని యాజ‌మాన్యం నిర్ణయించింది.

ఆదివారం నాడు క‌రీంన‌గ‌ర్ రీజియ‌న్ నుంచి 127, రంగారెడ్డి నుంచి 105, వ‌రంగ‌ల్ నుంచి 66, ఆదిలాబాద్ నుంచి 16 మొత్తంగా 360 ప్రత్యేక బ‌స్సుల‌ను హైద‌రాబాద్​కు సంస్థ న‌డిపిందని అధికారులు తెలిపారు. సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు ఆయా ప్రాంతాల‌నుంచి మ‌రో 147 స‌ర్వీసుల‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్రమే జీవో ప్రకారం ఛార్జీల‌ను స‌వ‌రించ‌డం జ‌రిగిందన్నారు. ఈ బ‌స్సులు మిన‌హా మిగ‌తా బ‌స్సుల్లో సాధార‌ణ ఛార్జీలే అమ‌ల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. స్పెష‌ల్ స‌ర్వీసుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం టికెట్ ధ‌ర‌లను సవరించడం జ‌రుగుతుంద‌ని టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం మరోసారి స్పష్టం చేసింది. సాధార‌ణ రోజుల్లో య‌థావిథిగా సాధారణ టికెట్ ధ‌ర‌లే ఉంటాయని, స్పెష‌ల్ స‌ర్వీసుల‌కు టికెట్ ధ‌ర‌లను సవరించడం సంస్థలో అనవాయితీగా వస్తోందని యాజమాన్యం తెలిపింది.

పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకుంటున్నారా? - తెలంగాణ ఆర్టీసీ సూపర్​ ఆఫర్ - మీ ఇంటికే బస్సు

భక్తులకు అదిరిపోయే శుభవార్త - కార్తికమాసం శైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌ సర్వీస్

Last Updated : Nov 4, 2024, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details