TGSRTC Bumper Offer For Passengers Traveling in AC Busses : ఆర్టీసీ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్ కలిగిన ప్యాసింజర్స్ తమ వద్ద ఉన్న బస్‌పాస్‌లతో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌పై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్పక్ బస్‌పాస్ కలిగిన ప్రయాణికులు ఈ రాయితీని పొందవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 31 వరకు 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో సుమారు 70 వేల వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాసులున్నాయని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వారిలో ఎక్కువ మంది వీకెండ్లో సొంతూళ్లకు వెళ్తున్నారని, ఈ నేపథ్యంలోనే బస్పాసుదారుల సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ఇస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సంస్థ అధికారిక వెబ్సైట్ http://tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని డిస్కౌంట్‌ను పొందవచ్చన్నారు. జనరల్ బస్‌పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నామని వీసీ సజ్జనార్ తన సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.