Lifetime Free Bus Pass For Baby Born in RTC :రాఖీ పౌర్ణమి రోజున గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవితకాలం పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ను అందిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఆడపిల్లకు పుట్టినరోజు కానుగా జీవితకాలం ఉచిత బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.
కండక్టర్‌తో పాటు గర్భిణీ డెలివరీకి సాయం చేసిన వనపర్తిలోని మదర్ అండ్ చైల్డ్ ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్‌పాస్‌ను యాజమాన్యం అందించింది. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పురిటినొప్పులతో బాధపడుతున్న గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న గద్వాల్ డిపోకు చెందిన కండక్టర్ భారతి, డ్రైవర్ అంజిలతో పాటు నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్ బస్ భవన్‌లో ఇవాళ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది.
MD Sajjanar Appreciates Lady Conductor :టీజీఎస్ఆర్టీసీసంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు. అనంతరం డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఏడాది పాటు ఫ్రీ ట్రావెల్ బస్ పాస్‌ను నర్సు అలివేలు మంగమ్మకు, చిన్నారి జీవితకాలం ఉచిత బస్ పాస్‌ను గద్వాల డిపో మేనేజర్ మురళీకృష్ణకు అందజేశారు.