TGPSC Released Group-3 Exam Key : గ్రూప్-3 పరీక్ష ప్రాథమిక కీ ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో ప్రాథమిక కీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈనెల జనవరి 12 వరకు గ్రూప్ 3 ప్రాథమిక కీ అందుబాటులో ఉండనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఏవైనా సందేహాలు ఉంటే ఈనెల 12న సాయంత్రం 5 వరకు స్వీకరిస్తామని పేర్కొంది.
అభ్యంతరాలను ఇంగ్లీష్‌లో తెలపాలని, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఆధారాల కాపీలను ఆన్‌లైన్‌లోనే పంపాలని సూచించారు. ఈ-మెయిల్, వ్యక్తిగతంగా వెళ్లి సమర్పించడాన్ని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని కమిషన్ స్పష్టంచేసింది. గ్రూప్-3 పరీక్షలను టీజీపీఎస్సీ 2024 నవంబర్ 17, 18వ తేదీల్లో నిర్వహించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
గ్రూప్-3 ప్రిలిమినరీ కీతో పాటు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఫలితాలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. 2023 జులైలో నిర్వహించిన పరీక్షకు సంబంధించి ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితా విడుదల ప్రకటించింది. మరో రెండ్రోజుల్లో గ్రూప్-2 పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశామని కూడా కమిషన్ వెల్లడించింది. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం మీడియాతో చిట్‌చాట్‌లో ఈ విషయాలను ప్రకటించారు.