TGNAB Reveals Drugs Buying Issue : డార్క్‌వెబ్ ద్వారా మత్తుపదార్థాల కొనుగోలు వ్యవహారం బయటపడడం సంచలనం రేపింది. ఖమ్మంకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కాలేజీలో చదివేటప్పుడు మత్తుపదార్థాలకి అలవాటయ్యాడు. పోలీసుల నిఘాతో ఏజెంట్లు సరుకు అందించేందుకు వెనుకాడటంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నించాడు. డార్క్‌వెబ్‌లో డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు, చైనా పోర్టల్ నుంచి భారతీయ కరెన్సీను క్రిప్టోగా మార్చి గత నెల 31న సుమారు 3 గ్రాముల సింథటిక్ డ్రగ్స్ ఆర్డరిచ్చాడు.
ముందస్తుసమాచారంతో ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై టీజీ న్యాబ్ పోలీసులు నిఘాపెట్టారు. డార్క్‌వెబ్ ద్వారా గతనెల 31న మత్తుపదార్ధాలకు ఆర్డర్ ఇవ్వగా ఈనెల 8న అసోంలోని సిల్‌గురి నుంచి స్పీడ్ పోస్టు ద్వారా వచ్చింది. ఆ స్పీడ్‌పోస్టును తీసుకుంటున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆనంతరం ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మత్తు మహమ్మారి నుంచి బయటపడడానికి చేయూత అందజేస్తామని స్పష్టం చేశారు.
డ్రగ్స్ నిర్మూలనకు అందరం కలిసి పోరాడాలని పోలీసులు పిలుపు : డార్క్‌వెబ్ ద్వారా అతడు ఇప్పటికే నాలుగుసార్లు ఎల్‌ఎస్‌డీ, హెరాయిన్ తెప్పించుకున్నట్టు టీజీ న్యాబ్ సమాచారం సేకరించింది. డార్క్‌వెబ్ ద్వారా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న వారిపై నిఘా అధికం చేస్తామని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి అసోం నుంచి ఎవరు పంపించారనే పోలీసులు లోతుగా ఆరాతీస్తున్నారు. ఇంకా ఎంత మంది ఇందులో ఉన్నారనే అంశాలపై, డార్క్‌వెబ్ లింకులను ఛేదించేందుకు డీఆర్ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూలాల్లోకి వెళ్లి కీలక సరఫరాదారుల ఆటకట్టిస్తామని చెబుతున్నారు.