TG Govt petition in Supreme CourtMedical admissions :ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశాలకు స్థానికత అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తెలంగాణలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో చేపట్టనున్న ప్రవేశాల్లో తెలంగాణలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
మెడికల్ అడ్మిషన్‌ల నిబంధనలు: మెడికల్ అడ్మిషన్‌ల నిబంధనలకు జీవో 33 ద్వారా చేసిన సవరణ 3(ఏ)ను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారంతా 85% స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కారణంగానే ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ జీవోను రద్దు చేయడం లేదని తన 71 పేజీల తీర్పులో పేర్కొంది. అయితే, విద్యార్థుల స్థానికతను నిర్ధారించడానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవని, వాటిని రూపొందించే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నామని తెలిపింది.
తెలంగాణలో చదువుకోలేదన్న కారణంతో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ నిరాకరించరాదని ఆదేశాల్లో పేర్కొంది. తాజాగా హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద తెలంగాణ తరఫు న్యాయవాది మెన్షన్ చేశారు. త్వరగా విచారణకు తీసుకుంటామని సీజేఐ ధర్మాసనం తెలిపింది.