Tesla EV Manufacturing Unit in Andhra Pradesh :అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ ‘టెస్లా ’ కార్ల తయారీ యూనిట్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తక్కువ ధరకు ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి తేవాలన్నది సంస్థ ఆలోచన. కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం ఆ సంస్థ ప్రతినిధి బృందం ఉమ్మడి నెల్లూరు జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాలోని భూములను పరిశీలించినట్లు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు సంస్థ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపగా పొరుగు రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. అయితే ఇప్పటికే సేకరించిన భూములు ఉండటం రాష్ట్రానికి సానుకూలాంశం కానుంది.
టెస్లా సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్న ప్రతిపాదనపై చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలపై టెస్లా ప్రతినిధి బృందం కొన్ని ప్రతిపాదనలు అందించినట్లు తెలిసింది. వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కీలక సమావేశం జరగాల్సి ఉందని. ఆ తర్వాత ప్రాజెక్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై సంస్థ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించొచ్చని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇందులో ప్రధాన నేత నిర్ణయమే కీలకం కానుంది.
అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ టెక్సస్‌లోని టెస్లా సంస్థ ప్రతినిధులను కలిసి సంప్రదింపులు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలంటూ ప్రభుత్వం కూడా పలుమార్లు టెస్లా సంస్థకు లేఖలు రాసింది. వర్చువల్ విధానంలోనూ చర్చించింది. రాష్ట్రంలో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలపై ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు తెలిసింది. దిగుమతి చేసుకునే కార్లపై కేంద్రం సుమారు 110 శాతం సుంకాలు విధిస్తోంది. దీనివల్ల కారు ధర భారీగా పెరుగుతోంది. దేశంలో తయారీ యూనిట్ ఏర్పాటు ద్వారా సుంకాల భారాన్ని తగ్గించుకోవాలన్నది టెస్లా ఆలోచన.