Tension in Byadgi Mirchi Market Yard in Karnataka:ప్రకృతి వైపరీత్యాలకు నాయకుల నిర్లక్ష్యం తోడవడంతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా, ప్రకృతి సహకరించకపోయినా పగలు, రాత్రి తేడా లేకుండా సాగు చేసి పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాదైనా మంచి దిగుబడి రాకపోతుందా అనే ఆశతో అప్పులు చేసి మరీ రైతులు సాగు చేస్తుంటారు. ఇంతా కష్టపడి పంటలు పండించినా వాటికి మాత్రం మద్దతు ధర ఉండట్లేదు.
పొగాకు గిట్టుబాటు ధరపై ఆశలు - చివరకు రైతులకు నిరాశే
ఇన్ని కష్టాలు పడుతున్నా ప్రభుత్వాలు, పాలకులు మాత్రం వీరిపట్ల దయ చూపడం లేదు. దళారీలు అన్యాయంగా రైతును నిలువునా దోచుకుంటున్నా పట్టించుకోవడం లేదు. రైతుల్ని దోచుకునే దళారీ వ్యవస్థను రూపుమాపి, గిట్టుబాటు ధర అందిస్తామని ప్రభుత్వాలు గొప్పలు చెపుకుంటున్నాయి కానీ క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. దళారీలు, పాలకులు ఒకటై అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పంటకు మద్దతు ధర ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్నారు.
భరోసా ఇవ్వలేకపోతున్న రైతు భరోసా కేంద్రాలు - ధాన్యం డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు
కష్టపడి పండించిన పంటకు మిరప వ్యాపారులు మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు మార్కెట్లోని వస్తువులను ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైతులు మరింత ఆగ్రహంతో వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో రైతులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే
కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా బ్యాడిగిలో మిరప రైతులు కన్నెర్ర చేశారు. ఆరుగాలం కష్టపడి కరవు పరిస్థితుల్లో పండించిన మిరపను కొనుగోలు చేయకుండా అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయటమే కాకుండా, ధరను తగ్గించడంపై ఏపీ, కర్ణాటక మిర్చి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది రైతులు మిరప పంటను అమ్ముకోటానికి రోజుల తరబడి వ్యాపారుల కోసం ఎదురుచూస్తున్నారు. బ్యాడిగి మార్కెట్ యార్డులో (Byadgi Mirchi Market Yard) మిరప వ్యాపారులంతా సిండికేట్గా మారి, ధరను పూర్తిగా తగ్గించడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో మార్కెట్ యార్డు కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
'ఎండిన పైరు రైతు కంట నీరు' - పంటను కాపాడుకోడానికి ఆలుపెరగని పోరాటం
మిరప వ్యాపారులు రైతులపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో, మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు యార్డులోని జీపులు, లారీలకు నిప్పుపెట్టారు. ఆ మంటలు అదుపు చేయటానికి వచ్చిన అగ్నిమాపక వాహనానికి కూడా నిప్పుపెట్టారు. అడ్డుకోడానికి వచ్చిన పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. తమ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోగా, పోలీసులతో అడ్డుకునే యత్నం చేస్తారా అంటూ అన్నదాతలు తిరగబడ్డారు. కర్ణాటక, ఏపీ నుంచి వచ్చిన రైతుల ఆగ్రహంతో బ్యాడిగి మార్కెట్ యార్డు (Tension in Byadgi Mirchi market yard) ఆవరణ యుద్ధ వాతావరణాన్ని తలపించింది.