Application For New Liquor Shops in AP :రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా, మొదటిరోజైన మంగళవారం 200కు పైగా వచ్చాయి. వీటిలో ఆఫ్‌లైన్ విధానంలో స్థానిక ఎక్సైజ్ స్టేషన్లలో నేరుగా సమర్పించినవే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
చివరి 3 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు :మంగళవారం అమావాస్య కావడంతో వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మొత్తంగా లక్షకు పైగా దరఖాస్తులు రావొచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుముల రూపంలోనే దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. 2017లో 4,380 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఒక్కో దానికి సగటున 18 చొప్పున మొత్తంగా 78 వేల దరఖాస్తులు అందాయి. ఈసారి 3,396 దుకాణాలకుగానూ ఒక్కో దానికి సగటున 30 వరకు దరఖాస్తులు పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల తొమ్మిది వరకు గడువు ఉండగా, చివరి 3 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు పడే అవకాశముంది.
ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోవాలి :మద్యం దుకాణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్ తీసుకొచ్చింది. hpfsproject.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫోన్ నంబర్‌నే యూజర్ ఐడీగా వినియోగించుకొని, పాస్‌వర్డ్ సృష్టించుకోవాలి. తర్వాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్ లేదా ఓటీపీతో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సమగ్ర యూజర్ మాన్యువల్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దరఖాస్తు విధానానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెబ్‌సైట్‌లో పెట్టారు.