తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎండలు బాబోయ్ ఎండలు - అడుగు బయట పెడితే సెగలే సెగలు - HIGH TEMPERATURE IN TELANGANA - HIGH TEMPERATURE IN TELANGANA

Heat wave in Telangana : రాష్ట్రంలో భానుడి ప్రకోపం అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు రోజురోజుకూ అధిక ఉష్ణోగ్రతుల నమోదవుతుండగా మరోవైపు వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా 8 జిల్లాలో 46 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా మరోవైపు వడదెబ్బతో నలుగురు మృతి చెందారు.

Highest Temperature in Telangana
High Heat wave in State (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 3, 2024, 10:51 AM IST

Highest Temperature in Telangana :తెలంగాణలో వారం రోజులుగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి ఉగ్రప్రతాపం ఉదయం ఎనిమిది గంటల నుంచే మొదలై సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగుతోంది. తాజాగా 8 జిల్లాల్లో 46 నుంచి 46.6 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో అత్యధికంగా 46.6 డిగ్రీలు రికార్డయింది. సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్‌, నాగర్‌కర్నూల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో 46 డిగ్రీలపైన నమోదయ్యాయి. నిర్మల్‌, గద్వాల, సిరిసిల్ల, యాదాద్రి, ఆసిఫాబాద్‌, ములుగు, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో 45.1 నుంచి 45.8 డిగ్రీల వరకు ఎండ కాసింది.

Telangana Heat Wave :గత వారం రోజులుగా కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉండటంతో వడగాలులు వీస్తున్నట్లు వాతావరణశాఖ ప్రకటిస్తోంది. 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీలపైన ఉష్ణోగ్రత ఉంటే వడగాలులుగా రికార్డు పరిగణనలోకి తీసుకుంటారు. ఒక ప్రాంతంలో 45 డిగ్రీల సెల్సియస్‌ దాటినా వడగాలుల ప్రభావం ఉన్నట్లు రికార్డు చేస్తారు. ఈనెల 2న 19 జిల్లాల్లోని 80 మండలాల్లో వీచాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో మే 2న 17 మండలాల్లో, నల్గొండ జిల్లాలో 14 మండలాల్లో వడగాలులు వీచాయి.

'రాష్ట్రంలో ఎండల తీవ్రత ఈ నెల 5వ తేదీ వరకు ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. సాధారణం కన్నా రెండు డిగ్రీల వరకు పెరిగాయి. ఈనెల 6 నుంచి కొంత ఉపశమనం దొరికే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నాం' - నాగరత్న, డైరెక్టర్‌, వాతావరణశాఖ, హైదరాబాద్‌

అల్లాడిపోతున్న రైతులు, కూలీలు :మెదక్‌ జిల్లా కొల్చారం మండల కేంద్రానికి చెందిన కుమ్మరి శాఖయ్య (55) గత పదిహేను రోజులుగా మామిడికాయలు కోసి టంకర ఎండబెడుతున్నారు. ఉన్నట్టుండి ఈ నెల 2న సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూరు మండలం గబ్బాయికి చెందిన పోర్తెటి శ్రీనివాస్‌(47) రెండు రోజుల క్రితం ఓ వివాహ వేడుకకు వెళ్లి అస్వస్థతకు గురయ్యారు.

మే 2న పరిస్థితి విషమించడంతో శ్రీనివాస్​ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. కరీంనగర్‌ జిల్లాలోని శంకరపట్నం మండలం లింగాపూర్‌లో గజ్జెల సంజీవ్‌(50) హమాలీగా పని చేస్తూ వడదెబ్బకు గురయ్యారు. ఇంట్లోనే చికిత్స పొందుతూ మే 1న రాత్రి మృతిచెందారు. హనుమకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తికి చెందిన వ్యవసాయ కూలీ అల్లె గోవర్ధన్‌(65) వడదెబ్బకు గురై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 2వ తేదీన సాయంత్రం మృతిచెందారు.

46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు

జిల్లా ప్రాంతం ఉష్ణోగ్రత
నల్గొండ ఇబ్రహీం పేట 46.6
సూర్యాపేట మునగాల 46.4
నల్గొండ నాంపల్లి 46.4
జగిత్యాల నేరెళ్ల 46.4
జగిత్యాల వెల్గటూరు 46.4
మంచిర్యాల జన్నారం 46.3
నల్గొండ కేతేపల్లి 46.2
నల్గొండ మాడుగులపల్లి 46.2
పెద్దపల్లి సుగ్లంపల్లి 46.2
నల్గొండ తెల్దేవరపల్లి 46.2
వరంగల్ గొర్రెకుంట 46.1
సూర్యాపేట పెదవీడు 46.1
నల్గొండ గుడాపూర్ 46
నల్గొండ కట్టంగూరు 46
నల్గొండ మాటూరు 46
మంచిర్యాల నర్సాపూర్ 46
నల్గొండ పెద్దవూర 46
కరీంనగర్ వీణవంక 46

భానుడి ప్ర'కోపం'తో నిర్మానుష్యంగా హైదరాబాద్​ రోడ్లు - పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్​, ఆరెంజ్​ హెచ్చరికలు - High Temperature in City

రాష్ట్రంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు - వడదెబ్బతో ఏడుగురు మృతి - TELANGANA HEAT WAVE NEWS

ABOUT THE AUTHOR

...view details