Police Focus on Cambodia Smuggling :ఉపాధిఆశతో కంబోడియా వెళ్లి అక్కడి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని నరకం చూస్తున్న తెలంగాణ యువత రక్షణపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 మందిని ఆ రాష్ట్ర పోలీసులు సైబర్ నేరస్థుల నుంచి విడిపించి వెనక్కి రప్పించింది తెలిసిందే. అదే విదంగా తెలంగాణకు చెందిన యువకులకు కూడా విముక్తి కల్పించాలని పోలీస్ అధికారులు నిర్ణయానికి వచ్చారు. అందుకు గల అవకాశాలపై అన్వేషణ సాగిస్తున్నారు.
ఉద్యోగ వేటలో ఉన్న యువతకు అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు గాలం వేస్తూ వారిని తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. అనంతరం వారికి నరకం చూపిస్తున్నారు. సైబర్ నేరస్థులు సింగపూర్‌తో పాటు ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయని నిరుద్యోగ యువతను ఆశపెడుతున్నారు. ఇలా చిక్కిన యువకులను కంబోడియా, మయన్మార్ వంటి దేశాలకు తరలిస్తూ వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నారు. బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా వారి పాస్‌పోర్టులు, ఇతర ధ్రువీకరణ పత్రాలను లాక్కుంటున్నారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తే చిత్రహింసలు పెడుతున్నారు.
Telangana Youth Trapped in Cambodia :ఇరుకు గదుల్లో ఉంచుతూ వారితో ప్రతిరోజూ 15 గంటలకు పైగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉండే అమ్మాయిల ఫొటోలు డౌన్‌లోడ్ చేయడం, వాటి ఆధారంగా తప్పుడు ప్రొఫైల్స్ సృష్టించడం, అనంతరం వారికి వలపు వల విసరడం, ఇందులో చిక్కుకున్న వారిని రకరకాలుగా వేధిస్తూ ఖాతాలు ఖాళీ చేయించడం తదితర పనులను ఆ యువకులకు అప్పగిస్తున్నారు. కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఎదురు తిరిగిన వారిని చీకటి గదుల్లో బంధిస్తున్నారు. కర్రలు, ఇనుప రాడ్లతో కొడుతున్నారు. తిండి పెట్టకుండా కడుపులు మాడ్చుతున్నారు. చుట్టూ ఎత్తైన ప్రహరీలు, పటిష్ఠ భద్రతా వ్యవస్థ వల్ల అసలు తప్పించుకునే అవకాశమే ఉండదని వారి వలలో చిక్కి, తిరిగివచ్చిన బాధితులు చెబుతున్నారు.