Union Budget 2024 Allocations for Telangana : కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పద్దుల లెక్కను మంగళవారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌లో తెలంగాణకు ఆశించిన మేరకు నిధులు కేటాయింపు జరగలేదు. ఈసారి మాత్రం తెలంగాణకు పన్నుల వాటా రూపంలో గతేడాది ప్రవేశపెట్టిన పద్దులో కంటే ఈసారి కాస్త ఊరట నిచ్చారనే చెప్పాలి. ఎందుకంటే ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.26,216 కోట్లు అందనుండగా, అదే గతేడాది రూ.23,216 కోట్లు వచ్చాయి. అంటే అదనంగా రూ.3,000 కోట్లు రాష్ట్రానికి దక్కనున్నాయి. దీంతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,273 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్నాయి. అయితే ఈ 15వ ఆర్థిక సంఘం నిధుల్లోనే గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,477 కోట్లు అందనుండగా, పట్టణ స్థానిక సంస్థలకు రూ.796 కోట్లు రానున్నాయి.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రానున్న నిధులు :
స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు నిధులు : బడ్జెట్‌లో దేశంలోని మరో ఏడాదిపాటు స్మార్ట్ సిటీల ప్రాజెక్టును కేంద్రం కొనసాగించేందుకు అంగీకరించింది. దీంతో పాటు అదనంగా రూ.2,236 కోట్లను పద్దులో కేటాయింపులు చేసింది. ఇది రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ లాంటి స్మార్ట్ సిటీలకు లబ్ధిని చేకూర్చనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్మార్ట్‌సిటీ ప్రాజెక్టును కొనసాగించాలని కోరింది. దీనికి అనుగుణంగానే బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన నిధులు కేటాయింపుతో ఈ రెండు నగరాల్లో పెండింగ్ పనులు పూర్తి కావడానికి దారులు తెరుచుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంతో కొంత నిధులు రావచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అమృత్ పథకానికి నిధుల పెంపు : పట్టణాల అభివృద్ధికి కేంద్రం అమృత్ పథకాన్ని తీసుకువచ్చింది. దీనికి ప్రతి బడ్జెట్లోనూ కేటాయింపులు చేస్తూ వచ్చారు. అయితే ఈసారి కూడా నిధుల కేటాయింపును కేంద్రం పెంచింది. గతేడాది రూ.4,222 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్‌లో రూ.6,931 కోట్లు కేటాయింపులు చేశారు. ఈ పెంపు రాష్ట్రంలోని అమృత పట్టణాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికావడానికి ఎంతో దోహదపడుతుంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు పెంపు : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ బడ్జెట్‌లో మాత్రం నిధుల కేటాయింపును పెంచింది. ఈ ఏడాది రూ.23,613 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపులతో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి ఎంతోగానే ఉపయోగం కానున్నాయి. రాష్ట్రానికి ఎంతో కొంత మేర నిధులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
'బడ్జెట్‌లో విపక్ష రాష్ట్రాలపై వివక్ష' - పార్లమెంట్‌లో నిరసనకు ఇండియా కూటమి రె'ఢీ'