Telangana Secretariat Gate Close: తెలంగాణ సచివాలయంలో ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు చేస్తున్నారు. తూర్పు వైపు ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన గేటును పూర్తిగా మూసివేయాలని నిర్ణయించారు. ఈశాన్యం వైపు ఇప్పుడున్న గేటు పక్కన మరోగేటు నిర్మించనున్నారు. సుమారు రూ. 3.20 కోట్లతో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయానికి ప్రస్తుతం నాలుగు వైపుల ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపు లుంబినీ పార్క్ ఎదురుగా ఉన్న బాహుబలి గేటు నుంచి మాజీ సీఎం కేసీఆర్ రాకపోకలు జరిపే వారు. ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు రాకపోకలు కొంతకాలంగా నిలిపివేశారు. ఆ మార్గంలోనే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు చుట్టూ లాన్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు.
వాస్తు కోసమేనా?: ఇక తూర్పు గేటును శాశ్వతంగా మూసివేయనున్నారు. పశ్చిమాన మింట్ కాంపాండ్ వైపున ఉన్న 3వ గేటును కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉపయోగిస్తున్నారు. అటువైపు ఎలాంటి మార్పులు చేయడం లేదు. మెయిన్ రోడ్డు వైపు ఉండే సౌత్-ఈస్ట్ గేటు నుంచి సచివాలయం సిబ్బంది, సాధారణ ప్రజల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ అధికారులు ప్రస్తుతం ఈశాన్యం వైపు గేటును ఉపయోగిస్తున్నారు. ఆ గేటు పక్కనే మరో గేటు నిర్మించనున్నారు. ఒక గేటు నుంచి లోనికి వెళ్లి మరో గేటు నుంచి బయటకు వేళ్లేలా ప్రణాళిక చేశారు. ఈశాన్యం, ఆగ్నేయం గేట్లను కలుపుతూ ఒక రోడ్డు కూడా నిర్మిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, వాస్తు కారణంగా ఈ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.