High Court On RGV Quash Petition: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టర్లు పోస్ట్ చేసిన వ్యవహారంలో ఇకపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని కోరుతూ రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను హైకోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని, విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అభ్యర్థనను అంగీకరించిన న్యాయమూర్తి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. ఒకే అంశంపై పలుచోట్ల కేసులు పెడుతున్నారంటూ ఆర్జీవీ తరఫు న్యాయవాదుల వాదనలు వినిపించారు.
వీడియో విడుదల చేసిన ఆర్జీవీ: మరోవైపు రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో కేసులకు తానేం భయపడటం లేదనంటూ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని రామ్‌గోపాల్ వర్మ ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నానని, అందుకే విచారణకు రాలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చారు.
కొనసాగుతున్న గాలింపు: నేతల పోలికలతో ఉన్న నటులతో ఓ పార్టీకి అనుకూలంగా సినిమాలు తీయడమే కాకుండా వాటి ప్రమోషన్ కోసం అప్పటి విపక్ష నేతలైన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై ఆర్జీవీ నోరు పారేసుకున్నారు. వ్యక్తిగత దూషణలు, మార్ఫింగ్ ఫొటోలతో ఇప్పుడు అతనికి చిక్కులు తెచ్చుపెట్టాయి. ప్రస్తుతం ఆర్జీవీ పోలీసుల నుంచి తప్పించుని తిరుగుతున్నారు. సోషల్ మీడియా, టీవీ షోలలో ఇష్టారీతిన ఆర్జీవీ రెచ్చిపోయేవారు. ఇప్పుడు ఇలా ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లారు.
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల రోజుల క్రితం ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఒంగోలు గ్రామీణ పోలీసులు తొలుత హైదరాబాద్‌లోని ఆర్జీవీ కార్యాలయంలో నోటీసులు అందజేశారు. ఆ తరువాత ఈ నెల 19వ తేదీన ఒంగోలు గ్రామీణ సీఐ శ్రీకాంత్‌బాబు ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తిరస్కరించడంతో వారం రోజులు సమయం కావాలంటూ దర్యాప్తు అధికారికి వాట్సాప్ ద్వారా సందేశం పంపించారు ఆర్జీవీ. అనంతరం ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. అయితే దానికి కూడా హాజరు కాకపోగా అప్పటి నుంచి ఇప్పటి వరకూ విచారణకు డుమ్మా కొడుతూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు.
'నేనేం భయపడటం లేదు'-వీడియో విడుదల చేసిన వర్మ
పోలీసుల విచారణకు వర్మ డుమ్మా - వాట్సాప్‌లో ఏం మెసేజ్ చేశారంటే!