TELANGANA RYTHU BHAROSA GUIDELINES :రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా పథకం 2025 మార్గ దర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రైతులకు సంబంధించిన అంశంలో పూర్తి స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతో తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు ఆధునిక పద్ధతులు ఆచరించేందుకు, అవసరం అయిన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది.
భూ భారతిలో నమోదైన సాగుయోగ్యమైన భూములకే రైతు భరోసా :గ్రామీణాభివృద్ధి, ఆహార భద్రతకు తోడ్పడడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొంది. ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపిన ప్రభుత్వం, పంట పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరాకు రూ.12 వేలు పెంచినట్లు తెలిపింది. భూ భారతి ఇప్పటి వరకు ధరణి పోర్టల్లో నమోదు అయిన వ్యవసాయ యోగ్యమైన భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు.