తెలంగాణ

telangana

ETV Bharat / state

'సంక్రాంతి'తో బ్లాక్​​బస్టర్​ కొట్టిన తెలంగాణ RTC - రూ.100 కోట్లు దాటిన కలెక్షన్స్! - TELANGANA RTC EARNS 100 CRORES

టీజీఎస్​ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిన సంక్రాంతి పండుగ - ఈసారి రూ.112.46 కోట్ల ఆదాయం సమకూరినట్లు అంచనా వేస్తున్న ఆర్టీసీ అధికారులు - గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.14 కోట్లు అధికం

Special Buses
RTC Earns 100 Crores with Special Buses (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2025, 7:49 AM IST

RTC Earns 100 Crores with Special Buses : సంక్రాంతి పండుగ ఆర్టీసీకి భారీగా ఆదాయాన్ని సమకూర్చింది. ప్రత్యేక బస్సులను నడిపించడం ద్వారా టీజీఎస్ ఆర్టీసీ రూ.112.46 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను భారీగా పెంచింది. దీంతో ఆదాయం కూడా భారీగానే సమకూరింది. 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా 4,962 ప్రత్యేక బస్సులను నడపగా, రూ.98.49 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 5,806 ప్రత్యేక బస్సులను నడిపించగా, ఈసారి రూ.112.46 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా మరో 844 ప్రత్యేక బస్సులను నడిపించారు. దాంతో ఈ ఏడాది సంక్రాంతికి రూ.14 కోట్లు అదనంగా వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు లెక్కలు వేస్తున్నారు.

గత ఏడాది సంక్రాంతి 15వ తేదీన రాగా, 10, 11, 12, 13, 14వ తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది పండుగ 14న రాగా 9, 10, 11, 12, 13 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య కూడా భారీగానే పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు ఆరు లక్షల వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లినట్లు తెలుస్తుంది. సొంతూళ్లకు వెళ్లి తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ఈ నెల 19, 20 తేదీల్లో ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. ఈ నెల 17, 18వ తేదీల్లో బస్సులు నడిపించినప్పటికీ అనుకున్నంత మంది ప్రయాణించలేదని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణ కంటే ఏపీఎస్ ఆర్టీసీ ఎక్కువ బస్సులను కేటాయించడంతో అక్కడి ప్రజలు ఎపీఎస్ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు : సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 5,806 ప్రత్యేక బస్సులను నడిపించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్​ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్​ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించింది. పండుగ సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సులకు 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేశారు. జనవరి 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడిపించారు. అయితే రద్దీ మాత్రం ఈ నెల 9వ తేదీ నుంచే ప్రారంభం అయినట్లు అధికారులు తెలిపారు. 9, 10, 11, 12, 13 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త - 3 రోజుల టూర్​ ప్లాన్​తో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ABOUT THE AUTHOR

...view details