Police Warns People On Old Phones :పాత సెల్‌ఫోన్ పనిచేయడం లేదని ముక్కూముఖం తెలియని వారికి అమ్మితే చిక్కుల్లో పడే అవకాశాలున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే సైబర్ నేరగాళ్ల చేతికి తాళం ఇచ్చినట్లేనని చెబుతున్నారు. పాత మొబైల్ ఫోన్లను కొని వాటితో సైబర్ నేరాలకు పాల్పడే ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తున్నాయి.
బిహార్‌కు చెందిన ఓ ముఠాను రామగుండం సైబర్‌క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం విధితమే. వారి నుంచి ఏకంగా 4,000కు పైగా సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారంటే పరిస్థతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ముఠాను విచారించడంతో కీలక విషయాలు వెలుగుచూశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఇలా పాత సెల్‌ఫోన్లు కొనుగోలు తంతు నడుస్తోందని తేలడం ఆందోళన కలిగిస్తోంది.
ఓ ముగ్గురి ముఠా బిహార్‌లోని ఖతిహార్ జిల్లా రౌతారా ప్రాంతానికి చెందిన అక్తర్‌అలీ సూచనతో పాత సెల్‌ఫోన్లు కొంటున్నట్లు తేలింది. తమ నుంచి కిలోల లెక్కన అక్తర్ వాటిని కొనుగోలు చేస్తున్నట్లు వారు పోలీసులకు తెలిపారు. అక్తర్ కోసం గాలిస్తున్నామని, అతడు దొరికితే ఈ దందాకు సంబంధించిన మరింత కీలక సమాచారం లభ్యమవుతుందని పోలీసులు చెబుతున్నారు.
మీ పేరుతోనే ఐఎంఈఐ నంబర్ :సాధారణంగా సెల్ఫోన్లలో కాపర్, లిథియం తదితర లోహాలతోపాటు మదర్‌బోర్డు, ఐసీ, స్క్రీన్‌లాంటి ఉపకరణాలుంటాయి. అవి వినియోగించగలిగే స్థితిలో ఉంటే నేరగాళ్ల ముఠాలు వాటిని వేరు చేసి తిరిగి విక్రయిస్తారు. దీంతో అంతగా ఇబ్బంది లేకపోయినా మరో రూపంలో ప్రమాదం పొంచి ఉందని పోలీసులు చెబుతున్నారు. పాత ఫోన్లలో డేటాను ఫార్మాట్ చేసి ఉండకపోతే ఇబ్బందులకు గురయ్యే ఆస్కారముంటుంది. వాటిలో పర్సనల్ చిత్రాలు, వీడియోలుంటే అవి సైబర్ నేరస్థుల ముఠాలకు చిక్కితే బ్లాక్‌మెయిల్ చేసే ప్రమాదముంది.
దీనికితోడు ఆయా ఫోన్లను సైబర్ నేరాలకు వినియోగిస్తే కొన్నిసార్లు దర్యాప్తు సంస్థలతో విచారణ ఎదుర్కొనే అవకాశాలుంటాయి. ప్రతి సెల్‌ఫోన్‌కు ఒక ఐఎంఈఐ నంబరు ఉంటుంది. దీనినే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫికేషన్ అంటారు. ఎవరైనా మొబైల్‌ను కొనుగోలు చేసినప్పుడు ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ వారి పేరిటే రిజిస్టరై ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ఫోన్‌ను దుర్వినియోగం చేసి ఎవరైనా సైబర్ నేరానికి పాల్పడితే దర్యాప్తు సంస్థల విచారణ సెల్ ఫోన్‌ను అధికారికంగా కొనుగోలు చేసిన వారితోనే మొదలవుతుంది.