Telangana Police NRI Wing : వివాహం అనంతరం భార్యను భారత్‌లో వదిలేసి విదేశాల్లో మకాం వేస్తున్న ప్రవాస అల్లుళ్లకు వార్నింగ్. ప్రవాస అల్లుళ్ల కుటుంబాలు భారత్‌లో కోడళ్లపై పాల్పడుతున్న గృహహింస విషయంలో కూడా స్వీట్ వార్నింగ్. ఎందుకంటే వారు ఎలాంటి చర్యలకు పాల్పడినా ఎన్ఆర్ఐ సెల్ ఉందనే విషయాన్ని మరవకూడదు. ఆడవాళ్లకు ఏదైనా జరిగితే ఇక ఎన్ఆర్ఐకి, ఎన్ఆర్ఐ కుటుంబానికి తాట తీస్తారు. బాధిత మహిళలకు న్యాయ సహాయం చేస్తూ ఎన్నో కేసులకు పరిష్కారం చూపింది ఈ సెల్.
విదేశాల్లో మహిళలు ఉన్నప్పటికీ గృహ హింసను ఎదుర్కొంటున్న బాధితురాళ్ల తరఫున వారి కుటుంబసభ్యులు ఇక్కడ ఫిర్యాదు చేస్తున్న కేసులకు ఎన్ఆర్ఐ సెల్ పరిష్కారం అందిస్తోంది. ఇలా తెలంగాణలోని 23 మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తులో స్థానిక పోలీసులకు సహకరిస్తోంది. అలాగే ప్రవాస అల్లుళ్లపై లుక్ అవుట్ నోటీసులు, పని చేస్తున్న కంపెనీల ద్వారా ఒత్తిళ్లు, నాన్ బెయిలబుల్ వారంట్ల జారీ, పాస్ పోర్టులు రద్దు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది.
నిందితులను ఇక్కడకు తీసుకు రావడానికి ఎంత శ్రమిస్తున్నారో, తీసుకొచ్చాక సీడీఈడబ్ల్యూ సంస్థ ద్వారా నిపుణులతో వారికి కౌన్సెలింగ్ చేయించడం, కాపురాలు నిలబెట్టడంతో కూడా అంతే శ్రమిస్తున్నారు. కలిపిన తర్వాత వదిలేయకుండా వారి బాగోగులు సైతం తరచూ అడిగి తెలుసుకుంటున్నారు.
ఆస్ట్రేలియాలో విభేదాలు - హైదరాబాద్‌లో రాజీ :హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన యువతికి 2011లో వివాహం అయింది. భార్యాభర్తలిద్దరూ ఏడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉన్నారు. వారికి అక్కడే అమ్మాయి జన్మించింది. భర్త వేరొకరితో వివాహేతర సంబంధం నెరపుతున్నారనే కారణంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. వెంటనే ఆమె అక్కడి నుంచి హైదరాబాద్ తిరిగొచ్చి అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే తెలంగాణ మహిళ భద్రత విభాగంలోని ఎన్ఆర్ఐ సెల్‌ను సంప్రదించగా, భర్తకు లుక్ అవుట్ సర్క్యూలర్‌ను పోలీసులు జారీ చేశారు. వెంటనే అతడిని భారత్‌కు రప్పించారు. నిపుణుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వగా, భార్యభర్తలిద్దరూ కలిసిపోయారు. ఆయన అక్కడి ఉద్యోగాన్ని ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు మార్పించుకున్నారు. ఇప్పుడు సుఖంగా ఉన్నారు.
భార్యతో రాజీపడి దుబాయ్‌కు : 2019లో దుబాయ్‌లో పని చేసే వ్యక్తితో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మహిళకు వివాహం అయింది. కుమారుడు పుట్టిన తర్వాత అతడు దుబాయ్ వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి రూ.2 లక్షల కట్నం కోసం వేధించేవాడు. ఆమె 2022లో కోరుట్ల పోలీస్ స్టేషన్లో గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. ఎన్ఆర్ఐ సెల్‌ను సంప్రదించారు. అతనిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసి, అతడు పని చేసే దుబాయ్ కంపెనీకి నోటీసును పంపించింది. అతడిని ఇక్కడికి రప్పించి, కౌన్సెలింగ్ ఇవ్వగా భార్యతో రాజీపడి దుబాయ్‌కు కాపురానికి తీసుకెళ్లాడు.