Telangana Phone Tapping Case Update :రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఐదు రోజుల పాటు న్యాయవాది సమక్షంలో ఇద్దరినీ దర్యాప్తు బృందం విచారించనుంది. ఈ కేసులో వీరిద్దరు ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారనుంది.
వారి ఇచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచారు. అతనికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్(14 Days Remand) విధించింది. ఈ మేరకు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
రాధాకిషన్‌రావు అరెస్టుపై పోలీసులు ప్రకటన : రాధాకిషన్‌రావు అరెస్టుపై పోలీసులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ట్యాపింగ్ కేసులో గురువారం టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును బంజారాహిల్స్ పీఎస్‌కు పిలిచి విచారించామని తెలిపారు. విచారణలో ప్రైవేటు వ్యక్తులపై నిఘా ఉంచి ట్యాపింగ్‌లో పాల్గొన్నట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులపై నిఘా( Political Leaders Surveillance) పెట్టినట్లు ఒప్పుకున్నారన్నారు. రాజకీయంగా పక్షపాతంతో కొన్ని చర్యలను చేపట్టినట్లు తెలిపారు.
ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సమయంలో అక్రమంగా రవాణా చేస్తున్న డబ్బును స్వాధీనంలో అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. కేసులో ఇతర నిందితులతో కుమ్మక్కై సాక్ష్యాలను ధ్వంసం, అదృశ్యం చేయడంలో సహకరించినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారని పోలీసులు వివరించారు. అతనిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని, రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు పూర్తి వివరాలు చెప్పారు.