Officials will be survey in Musi River Buffer Zone : కాలుష్య కాసారంగా మారిన మూసీని ప్రక్షాళించాలని సంకల్పం తీసుకున్న సర్కార్, ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రాథమికంగా మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులను గుర్తించిన ప్రభుత్వం, మరోమారు సర్వే చేస్తూ వివరాలు సేకరిస్తోంది. మూడు రోజుల పాటు నదీ గర్భంలోని నిర్మాణాలను మార్కింగ్ చేసిన అధికారులు, త్వరలోనే బఫర్‌జోన్‌లోనూ సర్వే చేయనున్నారు. ఈ మేరకు మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిషోర్, అధికారులు, పలు ఎన్జీవోలతో సమావేశమయ్యారు.
నిర్వాసితులయ్యే కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. లండన్‌లోని థేమ్స్, సౌత్ కొరియాలోని సియోల్ నదుల్లా మూసీని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారని దాన కిషోర్ వెల్లడించారు. ప్రక్షాళన కార్యక్రమం ఏకపక్షంగా కాకుండా శంకరన్ స్ఫూర్తితో ఎన్జీవోలు, నిర్వాసితుల కుటుంబాలతో చర్చించి తరలింపు, పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. నిర్వాసిత కుటుంబాల జోవనోపాధిపైనా సర్వే చేస్తున్నామన్న దాన కిషోర్, స్వయం సహాయక సంఘాల మహిళల కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు నష్టపోకుండా చర్యలు :మహిళా శక్తి పేరుతో మెప్మా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందేలా ప్రత్యేక చొరవ చూపుతామని దాన కిషోర్ వెల్లడించారు. ఇప్పటికే నిర్వాసిత కుటుంబాలకు 15 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం కేటాయించినట్లు వివరించారు. మూసీ బఫర్‌జోన్‌లోని నిర్మాణాలపైనా త్వరలోనే సర్వే జరపనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆయా ప్రాంతాల కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్ల ఆధ్వర్యంలో సర్వే చేపడతామన్నారు. బఫర్‌జోన్‌లో పట్టాలు ఉన్న కుటుంబాలకు పునరావాస చట్టం ప్రకారం పరిహారం అందించనున్నట్లు దాన కిషోర్ తెలిపారు. నిర్వాసితులకు అందాల్సిన ప్రయోజనాలన్నీ అందించాకే నిర్మాణాల కూల్చివేత చేపడుతామన్నారు.